ఆంధ్రపదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ఈరోజు ప్రాజెక్టును సందర్శించారు. విహంగ వీక్షణం ద్వారా కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించారు. పనుల తీరును ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ…
ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి జగన్ ని తీసుకొచ్చినా ఆయనకు అర్థమయ్యేది ఏముందని ఎద్దేవా చేశారు. ఆయనకి పిల్లర్ అంటే తెలుసా, ఎర్త్ వర్క్ అంటే తెలుసా, డయాఫామ్ వాల్ అంటే తెలుసా అంటూ వ్యాఖ్యానించారు. నలభైయేళ్లుగా ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాలను చూస్తున్న తనకు కూడా కొన్ని సాంకేతిక అంశాలు ఇప్పటికీ తెలియవని చంద్రబాబు చెప్పారు. ఈ మధ్య ప్రాజెక్టు చూడ్డానికి వచ్చిన ఒక నాయకుడు (అంబటి రాంబాబుని ఉద్దేశించి).. డయాఫామ్ వాల్ ఎక్కడుందని అడుగుతున్నారనీ, అవగాహన లేకపోతే హుందాగా ఉండాలిగానీ… ఏమీ తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి అన్నారు. డయాఫామ్ వాల్ తెలియాలంటే ఆయన్ని భూమి లోపలికి పంపించాలన్నారు.
ఏడు ముంపు మండలాలు రాకపోతే పోలవరం మన వూహకు కూడా అందేది కాదు. కాంక్రీటు పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయితే గ్రావిటీ ద్వారా నీరందిస్తాం. పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోంది.ప్రతి సోమవారం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తున్నాం. రోజువారీ లెక్కలు చెబుతుంటే మళ్లీ శ్వేతపత్రం ఏమిటి?. ప్రాజెక్టును అడ్డుకోవద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి రాజీ పడబోం. అడ్డుకుంటే చూస్తూ వూరుకోం’ అని హెచ్చరించారు.