అక్టోబరు 14న నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటన చేసారు. సీఎం కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉండే ఎంజీ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం, కొన్ని ఫంక్షన్ హాలు ప్రాంతాల్లో మాత్రం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే విషయం గ్రహించి, ముఖ్యమంత్రి ఎప్పుడూ తిరగని ప్రాంతాల్లో పర్యటించారు... అప్పుడు విజయవాడ నగరం అసలు స్వరూపం ఆయన దృష్టిలో పడింది. అపరిశుభ్రత రాజ్యమేలుతున్నట్లు స్వయంగా చూశారు. కాలువ గట్లు, రహదారులు, డివైడర్లు, కూడళ్లు అన్నీ దారుణంగా కనిపించాయి. వెంటనే జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంకు ఆదేశాలు జారీ చేశారు.
నగరపాలక సంస్థ, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతో మూడు శాఖలు సమన్వయంగా సమావేశమై బాధ్యతలు తీసుకున్నాయి. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపి నగరానికి రంగులు అద్దారు. డివైడర్లలో పచ్చదనం పెంచారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న గోడలపై చిత్రాలు వేశారు. ఈ పెయింటింగ్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. గతంలో కొంతమంది స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ వంతెనలు, రైల్వే పాసింగ్ ఇతర ప్రాంతాల్లో వేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. రైవస్ కాలువ, ఏలూరు కాలువ వెంట సుందరీకరణ పనులు చేశారు.
రామవరప్పాడు నుంచి గన్నవరం వరకు సుందరీకరణ చేసేలా చర్యలు తీసుకున్నారు. జంక్షన్లను అభివృద్ధి చేశారు. కూడళ్ల వద్ద ఫౌంటెన్లు, రామవరప్పాడు వద్ద ఆధునికీకరణ తదితర పనులు చేశారు. ఆయా ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. స్క్రాప్ పార్కులను అందంగా తీర్చిదిద్దారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సీఎం నివాసానికి వెళ్లే మార్గాన్ని సుందరీకరణ చేశారు. మొక్కలు పెంచారు. ఇంద్రకీలాద్రికి వెళ్లే మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటితో నగర ముఖ ద్వారాలు సుందరంగా కనిపిస్తున్నాయి. సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. ఇక నుంచి నిత్యం వీటిని నిర్వహణ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టరు బి.లక్ష్మీకాంతం చెబుతున్నారు. సీఎం పర్యటనతో నగరంలో చాలా వరకు మార్పు వచ్చిందని ఆయన అంగీకరించారు. ఇక ముందు ఇదే తరహాలో అన్ని శాఖల సహకారంతో తీర్చిదిద్దుతామని చెప్పారు...