మీరు ఏదన్నా ప్రభుత్వ సేవలు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారా ? ఎన్ని రోజులు అయినా మీ సమస్య పరిష్కారం అవటం లేదా ? మీ మాట ఎవరూ వినట్లేదా ? ఇక నుంచి ఇలాంటివి అసలు కుదరవు... ఇక నుంచి ప్రభుత్వం నుంచి మీరు సేవలు పొందటం హక్కు.... ప్రభుత్వం చెప్పిన గడువు లోపు మీ సమస్య పరిష్కారం కాకపొతే, మీకు ప్రభుత్వం ఫైన్ కడుతుంది.. దీనికి సంబంధించి, 'ఏపీ ప్రజా సేవల సమకూర్చు హామీ చట్టం-2017'ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా దీన్ని రూపొందించారు.
ఇప్పటివరకూ ప్రజలు విన్నవించుకున్న సమస్యను పరిష్కరించడానికి నిర్ణీత గడువు మాత్రమే వుంది. గడువు ముగిసినా సమస్య పరిష్కారం కాకపోతే అధికార్లపై చట్ట బద్ధంగా ఫిర్యాదు చేసే అవకాశం పౌరులకు లేదు. ప్రజా సేవల చట్టం అమల్లోకి వస్తే ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే దానికి అధికార్లను భాద్యులను చేసే వీలు ఉంటుంది. ప్రతి దరఖాస్తునూ ఒక నిర్ణీత సమయంలో సంబంధిత అధికారి పరిష్కరించాల్సిందే. సరైన కారణాలు లేకుండా కొర్రీలు వేసినా, దరఖాస్తును పక్కన పడేసినా, సంబంధిత అధికారి అందుకు జరిమానా చెల్లించాల్సిందే.
పారదర్శక, సమర్థ, సకాలంలో సేవల బిల్లు మంగళవారం పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగి సభ ఆమోదం పొందితే.. ఇక రాష్ట్రంలో ప్రతి దరఖాస్తూ నిర్ణీత కాల వ్యవఽధిలో పరిష్కారం కావాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్ర, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ కమిటీలను వేస్తారు. జిల్లాస్థాయిలో కలెక్టరు, జిల్లా పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో కమిటీ ఉంటుంది. ఈ కమిటీలు దరఖాస్తులు ఎప్పటిలోగా పరిష్కరించారో పరిశీలిస్తాయి. సేవలు అందించలేకపోతే సంబంధిత అధికారి సహేతుకమైన కారణం చూపాలి. లేకపోతే సంబంధిత అధికారికి జరిమానా విధిస్తారు.