ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అక‌స్మాత్తుగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కి వెళ్లారు. ఓవైపు జీ-20 స‌మావేశాలు విశాఖ‌లో జ‌రుగుతుండ‌గా హుటాహుటిన ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహ‌న్ రెడ్డి చేరుకోవ‌డంతో ర‌క‌రకాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. త‌న బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసు విచార‌ణ జోరందుకున్న ప్ర‌తీసారీ జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్తుండ‌డంపై టిడిపి చాలా వ్యంగ్యంగా ప్ర‌శ్నిస్తోంది. ప్ర‌తీసారీ సీఎం జ‌గ‌న్ రెడ్డి టూరుపై పోల్ నిర్వ‌హించే టిడిపి యువ‌నేత లోకేష్ ఈ సారి కాస్త డిఫ‌రెంట్ సెటైర్ ఎక్కుపెట్టారు. జ‌గ‌న్ ఢిల్లీటూర్ల‌ పై ప్రజలకు క్విజ్ పోటీ అంటూ ట్విట్ట‌ర్లో మూడు ఆప్ష‌న్ల‌తో ట్వీటేశారు. మొద‌టిది జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌ ఇది ఎన్నోసారి? అని ప్ర‌శ్నించారు. రెండో ప్ర‌శ్న‌గా ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రానికి ఏం సాధించారు? అని నిల‌దీశారు. ప్ర‌తీసారి ప్ర‌త్యేక విమానంలో వెళ్లి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఏమీ సాధించ‌కుండా రావ‌డంపై కూడా మూడో ప్ర‌శ్న‌గా ప్ర‌త్యేక‌ విమానానికి ఎన్ని కోట్లు ఖర్చు? అని అడిగారు. ఒక నెల‌లో రెండుసార్లు హ‌ఠాత్తుగా అత్యంత ముఖ్య స‌మావేశాలు వ‌దిలి మ‌రీ ఢిల్లీ వెళ్లింది త‌న వ్య‌క్తిగ‌త ఇబ్బందులు, కేసుల నుంచి ర‌క్ష‌ణ కోస‌మేన‌ని టిడిపి ఆరోపిస్తోంది. దీనిపై వైసీపీ క్యాంపు స్పందించ‌క‌పోవ‌డం, కేసుల ఊసు వ‌చ్చిన‌ప్పుడే సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం టిడిపి అనుమానాల‌కు ఊతం ఇస్తోంది.

ప‌రిటాల ర‌విని దారుణంగా హ‌-త్య చేసిన త‌రువాత నిందితులు, అనుమానితులు గొలుక‌ట్టు మ‌ర‌ణాలు తెలుగు రాష్ట్రాల‌కు ఇంకా నెత్తుటి సాక్ష్యాలుగా ఉన్నాయి. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌-త్య త‌రువాత సేమ్ అలాగే అనుమానితుల అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు, హ‌-త్య‌-లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ న‌లుగురు అనుమానాస్ప‌దంగా చ‌నిపోగా, ఏ2 సునీల్ కుమార్ యాద‌వ్ బంధువు భ‌ర‌త్ యాద‌వ్. వివేకానంద‌రెడ్డి హ‌-త్య కేసు విచార‌ణ‌కి కూడా హాజ‌ర‌య్యాడు. వివేకా హ‌త్య‌కి 40 కోట్ల డీల్ జ‌రిగింద‌ని  సీబీఐ అఫిడ‌విట్‌లో పేర్కొంది. ఇప్పుడు భ‌ర‌త్ యాద‌వ్ ఒక‌రిని చంపేసి, మ‌రొక‌రిని చావుబ‌తుకుల్లోకి నెట్టిందీ ఆర్థిక లావాదేవీలే కార‌ణ‌మ‌ని పోలీసులు చెబుతున్నారు అంటే.. అనుమానాలు వ‌స్తున్నాయి. పులివెందులలో భ‌ర‌త్ యాద‌వ్ జ‌రిపిన తుపాకీ కాల్పుల్లో దిలీప్ చ‌నిపోగా, మ‌స్తాన్ భాష గాయ‌ప‌డ్డాడు.  అనేక నేరాల‌తో సంబంధాలున్న భ‌ర‌త్ యాద‌వ్ కి లైసెన్స్ తుపాకీతో ఈ కాల్పులు జ‌రిపాడు. ప‌ట్ట‌ప‌గ‌లు ముఖ్య‌మంత్రి సొంతూరులో, అవినాష్ రెడ్డి మ‌నిషిగా ప్ర‌చారం జ‌రుగుతున్న భ‌ర‌త్ యాద‌వ్ ఈ ఘాతుకానికి పాల్ప‌డితే పోలీసుల స్పంద‌న మ‌రో తీరుగా ఉంది. చంపడం  క‌రెక్టే కానీ, దీనిపై పోలీసుల  చెప్పే వెర్ష‌న్ కాకుండా ఇంకేమైనా రాస్తే చ‌ర్య‌లు తీసుకుంటామంటూ హెచ్చ‌రించారు పోలీసు అధికారి. గతంలోనూ భరత్ యాదవ్ తుపాకీతో కాల్పులు జ‌రిపి హ‌త్యాయ‌త్నం చేసినా, తుపాకీ స్వాధీనం చేసుకోక‌పోవ‌డంపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

సీబీఐ ఈడీ న‌మోదు చేసిన 43 వేల కోట్ల అక్ర‌మాస్తుల కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఏ1. ఈ కేసుల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు జ‌గ‌న్ రెడ్డిని ఏ ప‌త్రికైనా ఏ1గానే రాస్తుంది. చివ‌రికి అదే అక్ర‌మ సంపాద‌న‌తో పెట్టుకున్న సాక్షిలో కూడా సీబీఐ-ఈడీ క్విడ్ ప్రోకో కేసులు గురించి వార్త రాయాల్సి వ‌స్తే ఏ1 జ‌గ‌న్ రెడ్డి అనే రాస్తాయి. అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నైజం, బుద్ధి వేరు. త‌న‌ని అరెస్ట్ చేశారు కాబ‌ట్టి, త‌న ప్ర‌త్య‌ర్థులంద‌రూ అరెస్టు కావాలి. తాను దొంగ‌త‌నం మాన‌డు, దొంగ అంటే ఊరుకోడు ఇదీ జ‌గ‌న్ మెంటాలిటీ. త‌న పేరుని అక్ర‌మాస్తుల కేసుల సంద‌ర్భంగా ఏ1 అని రాసిన ఈనాడుపై క‌క్ష క‌ట్టారు. ఎవ‌రూ ఫిర్యాదు ఇవ్వ‌కుండానే త‌న అధికార‌యంత్రాంగాన్ని పంపి కేసులు న‌మోదు చేయించారు. ఫిర్యాదులేవు, అక్ర‌మాలు లేవు. కేవ‌లం జ‌గ‌న్ రెడ్డి త‌నని ఏ1 అన్న రామోజీరావు పేరు ప‌క్క‌న ఏ1 అని పెట్టాల‌నే శాడిజం కోరిక‌తోనే ఈ కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులే ఆఫ్ ది రికార్డుగా చెప్పేస్తున్నారు. తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లతో ఏపీ సీఐడీ ఏ1గా రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైల‌జ‌ను పేర్కొంది. ఈ కేసులో  రామోజీరావు కోడ‌లు  శైల‌జ‌కు , రామోజీరావుకు సైతం నోటీసులు పంపింది. ఈ నెల 29, 31, ఏప్రిల్ 3, 6 తేదీల్లో విచార‌ణ‌కు అందుబాటులో ఉండాల‌ని ఆ నోటీసుల‌లో పేర్కొన్నారు.  1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసిన ఈ కేసుల్లో చాలా రోజులుగా సోదాలు చేస్తున్నారు. మార్గదర్శిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని  ఏ 1 గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా చెరుకూరి శైలజ, ఏ 3 గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీరావుకి ఊడిపోయేదీ ఏమీ ఉండ‌దు. కానీ రామోజీరావుని ఏ1 చేశాన‌నే పైశాచిక ఆనందం ఒక్క‌టే జ‌గ‌న్ రెడ్డికి మిగులుంది.

వైఎస్ జ‌గ‌న్ రెడ్డి మ‌ళ్లీ ఢిల్లీ బ‌య‌లు దేరుతున్నారు. మొన్న‌నే అసెంబ్లీ స‌మావేశాలను వ‌దిలేసి మ‌రీ ఢిల్లీ వెళ్లి వ‌చ్చి త‌న త‌మ్ముడు వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో అనుమానితుడైన అవినాశ్ రెడ్డి అరెస్టుని ఆప‌గ‌లిగాడు. అయితే ద‌ర్యాప్తు అధికారిని బ‌దిలీ చేయించ‌లేక‌పోయాడు. అలాగే సుప్రీంకోర్టు వివేకా కేసు ద‌ర్యాప్తు ఆల‌స్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డంతో ఇంక అవినాష్ రెడ్డి అరెస్టు త‌ప్ప‌ద‌ని నిర్ణ‌యించుకున్న సీఎం జ‌గ‌న్ రెడ్డి మ‌ళ్లీ ఢిల్లీ బాట‌ప‌ట్టాడు. అవినాష్ రెడ్డి కూడా వివిధ కోర్టుల్లో ర‌క‌ర‌కాలుగా పిటిష‌న్లు వేస్తూ ద‌ర్యాప్తుని నీరుగార్చే ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లం కావ‌డంతో అరెస్టు త‌ప్ప‌ద‌ని నిర్ధారించుకున్న‌ట్టున్నాడు. తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖ‌లు చేశాడు. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ పిటిషన్ వేయ‌డంతో ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర నిర్ధార‌ణ అయ్యింద‌ని, అరెస్టు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని, అందుకే యాంటిసిపేట‌రీ బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేశార‌ని వైసీపీలోనే అంత‌ర్గ‌త చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ, ఆధారాలు చిక్క‌డంతో అరెస్టు చేయ‌వ‌చ్చ‌నే ఊహాగానాల నేప‌థ్యంలో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లుతో వివేకా హ‌త్య‌కేసులో అవినాష్ రెడ్డి సాక్షి కాదు నిందితుడేన‌ని స్ప‌ష్టం అవుతోంద‌ని న్యాయ‌వాదులు చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read