మోదీ దత్తపుత్రుడుగా ఉన్న జగన్‌ను ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా చేశారని సీనియర్ కాంగ్రెస్ నేత హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ జగన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన హర్షకుమార్ ని అక్రమ కేసుల్లో ఇరికించి జగన్ రెడ్డి అరెస్ట్ చేయించారు. అప్పటి నుంచీ అడపాదడపా వైసీపీ సర్కారు తీరుపై విరుచుకుపడుతున్న హర్షకుమార్ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి మీడియా ముందుకొచ్చారు. మోదీ ఇంటి పేరున్నవారంతా దొంగలేనని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీకి కోర్టు జైలుశిక్ష విధించడం, వెనువెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం వంటి పరిణామాలపై హర్షకుమార్ స్పందించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వారిపై ప్రభుత్వమే కేసులు పెడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం న్యాయ స్థానాలని తన చేతుల్లోకి తీసుకుందని దుయ్యబట్టారు. బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టిన వారినందరినీ మోదీ విదేశాలకు పంపేశారని, రాహుల్‌ని లోక్‌సభ నుంచి సస్పెన్షన్ చేయటం దుర్మార్గం అని ఖండించారు. మోదీ దత్తపుత్రుడుగా ఉన్న జగన్‌ను ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా కోర్టులని మేనేజ్ చేశారని ఆరోపించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలతో బీజేపీ-జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ బంధం మరోసారి బయటపడింది.
news
జగన్ ఘోర ఓటమి పై ఢిల్లీలో నడుస్తున్న ఆసక్తికర చర్చ...
వైసీపీ పతనం గురించి ఇప్పటివరకూ తెలుగురాష్ట్రాల్లోనే విశ్లేషణలు సాగుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో వైసీపీ మద్దతు అభ్యర్థుల ఓటమి తరువాత వైసీపీలోనూ అంతర్మథనం మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా వైసీపీలో అసమ్మతి సెగలు కాక రేపాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనూ వైసీపీ డౌన్ ఫాల్ పై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అయితే వైసీపీ ఎంపీలే తమ పార్టీ సీను కాలిపోయిందని వ్యాఖ్యానిస్తుండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ ఎంపీలలో అంతర్మథనం మొదలైందని సమాచారం. సీఎం జగన్ రెడ్డి అహంకార ధోరణి, విఫల పాలనపై వైసీపీ ఎంపీలు గుర్రుగా ఉన్నారు. చెబితే వినే పరిస్థితి లేదని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైసీపీ ఎంపీలే బహిరంగంగా ఢిల్లీలో సహచర ఎంపీలతో చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలకు వచ్చిన వైసీపీ ఎంపీలు, ఇతర పార్టీల ఎంపీలతో మాటల సందర్భంలో బరస్ట్ అయ్యారని ఓ చానల్ వెల్లడించింది. మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం చాలా కష్టమని తెలంగాణ ఎంపీ ఎదుట వైసీపీ ఎంపీ కుండబద్దలు కొట్టారు. జగన్ రెడ్డికి అన్నివిధాలా కావాల్సిన వ్యక్తి అయిన ఆ ఎంపీ.. తాము అనుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటని వ్యాఖ్యానించారని సమాచారం. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చాలా పవర్ ఫుల్ గా ఉంటారని, ఆయన ఎత్తుల ముందు వైసీపీ తేలిపోతోందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి వేవ్‌ని తట్టుకుని నిలవడం అసాధ్యమని తెలంగాణ ఎంపీ ఎదుటే తేల్చేశారు. ఆ నలుగురు కోటరీలో జగన్ రెడ్డి ఇరుక్కుపోయారని, ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడని వాపోయారు. వైనాట్ 175 అని, అంతా బాగుందని మేము చెబుతున్నా, పరిస్తితులు చాలా ప్రతికూలంగా వున్నాయని వైసీపీకి చెందిన మరో ఎంపీ మాటల్లో బయటపడ్డారు.
మరో నలభై మంది ఉన్నారా ? ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అనుమానంతో చూస్తున్న జగన్..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. మొన్నటివరకూ ఆత్మవిశ్వాసానికి అడ్రస్‌లా కనిపించేవాడు. ఎన్నికల యుద్ధంలో గెలుపులు వచ్చి వాలుతుంటే తనకి ఎదురే లేదని ఫిక్స్ అయిపోయాడు. తన బొమ్మ కనిపిస్తే గెలుపు ఖాయమనే రేంజుకి చేరాడు. ఈ స్థితిలో మూడు ప్రాంతాల్లో మూడు పట్టభద్రుల స్థానాలను చేజిక్కించుకున్న టిడిపి పట్టభద్రులు తొలి ఝలక్ ఇచ్చారు. ఓటమి కారణాలు సమీక్షించుకునే ఆలోచనే లేని జగన్ రెడ్డి తన చుట్టూ ఉన్నవారిని అనుమానించడం మొదలు పెట్టారు. తనది కాని సీటు కోసం కొనుగోలు చేసిన నలుగురు టిడిపి వాళ్లని నమ్ముకుని ఏడు సీట్లకి పోటీకి దింపారు. ఇక్కడే తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తున్నారనే కారణంతో చాలా మంది సొంత పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో సమన్వయకర్త పేరుతో కక్ష సాధింపులకు దిగారు జగన్ రెడ్డి. దీంతో వాళ్లంతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారని డౌట్ పడిన జగన్ పై టిడిపి మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. టిడిపితో టచ్‌లో 16 మంది ఉన్నారని లీకులిచ్చారు. దీంతో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఏ ఎమ్మెల్యేనీ నమ్మని జగన్ అందరిపైనా నిఘా వేయించాడు. చివరికి తనకి అత్యంత నమ్మకస్తులనీ నమ్మడంలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి నలుగురిని సస్పెండ్ చేసినా, టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన మరో 40 మంది వరకూ ఎమ్మెల్యేలు హ్యాండిచ్చే అవకాశం ఉందని జగన్ రెడ్డి అనుమానిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురే క్రాస్ ఓటింగ్‌కి చేశారని భావిస్తున్న నలభై మందిపై జగన్ రెడ్డి డౌట్ పడుతున్నారని వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది.
సజ్జల, నీ మొఖం అద్దంలో చూసుకో... ఆనం సంచలన వ్యాఖ్యలు
ఏమీలేని సజ్జల రామకృష్ణారెడ్డి కోట్లాధిపతి ఎలా అయ్యారని, అవినీతిని ప్రశ్నిస్తే జగన్ రెడ్డి ఫోన్ చేసి మరీ బెదిరించారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది సీఎంలని చూశానని ప్రజాస్వామ్యాన్ని ఇంతగా దిగజార్చిన సీఎంని తొలిసారి చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను క్రాస్ ఓటింగ్ చేశానని బురద చల్లుతున్నారని, సజ్జల ముందురోజు ఓ మాట, తర్వాత రోజు ఓ మాట మాట్లాడారని మండిపడ్డారు. సీక్రెట్ బ్యాలెట్‍లో తాను ఎవరికి ఓటేశానో సజ్జలకి ఎలా తెలుసు అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇంచార్జిగా నియమించిన రోజే ఆ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అందరూ అమ్ముడుపోయారని అంటోన్న సజ్జల కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగారో తనకి తెలుసు అని అన్నారు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తే సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసి మందలించారని ఆనం వెల్లడించారు. ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేశానని, ఎవరికి ఓటు వేశానో చెప్పనని ఆనం రాంనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యవస్థల్లో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయని, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం దారుణం అని వాపోయారు. జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థల గురించి ప్రశ్నించానని, అభివృద్ధి నిలిచిపోయింది.. ప్రాజెక్టులు, నిర్మాణాలు జరగట్లేదని ప్రశ్నించినందుకే తన గొంతుకను అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నలభై ఏళ్లుగా అనేకమంది నాయకుల వద్ద పనిచేశానని, ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంత దిగజారడం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.