జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో, ఇసుక నుంచి క-రో-నా వరకు, ప్రభుత్వ అసమర్ధ నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఒక వర్గం కాదు, ఒక సమస్య కాదు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వం అనలోచిన నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ఎందుకో కానీ, బహిరంగంగా ప్రభుత్వం పై తమ నిరసన తెలపలేక పోయారు. భయం వల్లో, లేక వస్తున్న పధకాలు పోతాయనో ఏదో కానీ, వారు మొత్తానికి వెనకడుగు వేస్తూ వచ్చారు. అయితే మొదటి సారి, జగన్ ప్రభుత్వం పై పూర్తి వ్యతిరేకత వచ్చిన సందర్భంగా, రెండు రోజులు క్రిందట విడుదల చేసిన జాబ్ క్యాలెండర్. ప్రతి సారి చేసినట్టు ప్రజలను మాయ చేద్దామని అనుకున్నారు. అయితే యువత దెబ్బకు, వారిని మాయ చేయటం కుదరలేదు. సోషల్ మీడియా వేదికల్లో, సాక్షి టీవీ ఫోన్ ఇన్ లో, చివరకు రోడ్డుల మీద కూడా పెద్ద ఎత్తున యువత నిరసన తెలుపుతున్నారు. జగన్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న యువత, అందులో ఉద్యోగాలు, ప్రభుత్వం మభ్య పెడుతున్న విధానం చూసి, మోసపోయామని గ్రహించారు. అయితే ఈ వ్యతిరేకత ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. యువత ఆవేశం, వారి నిస్పృహ చూస్తుంటే, ఇది ఎంత వరకు వెళ్తుందో అనేది కూడా చూడాల్సి ఉంది. రాష్ట్రంలో 2.30లక్షల ఖాళీలు ఉంటే కేవలం 10వేల 143 ఉద్యోగాలకు ఇచ్చిన కంటి తుడుపు నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం నిరుద్యోగులను అవమానించడమే, అని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.
రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, "రాష్ట్రంలో రెవిన్యూశాఖలో 1150 పోస్టులు, పోలీసుశాఖలో 15వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 25వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే డిఎస్సీ ప్రసాతవనే లేదు. పంచాయితీరాజ్, మున్సిపల్, మున్సిపల్, వాణిజ్యపన్నులు, ఇంజనీరింగ్ విభాగాల్లో వేలాది ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉన్నా క్యాలండర్లో వాటి ప్రస్తావనే లేదు. 907 గ్రూప్-1,2 ఉద్యోగాలకు గాను కేవలం 36 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ జాబ్ క్యాలండర్లో బిసి బ్యాక్ లాగ్ పోస్టులు చూపనే లేదు. డిగ్రీ, పిజి, బి.టెక్, ఎం.టెక్, ఎంబిఎ, ఎంసిఎ పూర్తిచేసిన వేలాది నిరుద్యోగుల ఆశలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు చల్లింది. వైసిపి కార్యకర్తలకు కేవలం గౌరవ వేతనంతో ఇచ్చిన 2,59,565 వాలంటీర్ ఉద్యోగాలు, ఎపిపిఎస్సీ తో సంబంధం లేకుండా అధికారపార్టీనేతల సిఫారసులతో ఇచ్చిన 1,21,518 గ్రామసచివాలయ ఉద్యోగాలు కలిపి 3,81,083 ఉద్యోగాలను కల్పించినట్లుగా చూపడం నిరుద్యోగులను మోసగించడమే. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మోసపు మాటలు చెప్పిన జగన్ రెడ్డి మాట తప్పి మడమతిప్పారు." అని అన్నారు.