నిన్న ఒక ప్రాముఖ పత్రికలో వచ్చిన వార్త, ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది. అయితే నిన్న చంద్రబాబు టూర్ ఉద్రిక్తంగా మారటంతో, అందరూ ఈ విషయం మర్చిపోయారు. ఆ వార్త ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు, రూ.30 కోట్ల రూపాయాలు, డీల్ లో లబ్ది పొందారని. రాయలసీమలోని ఒక అశ్రామంలో ఐటి అధికారులు సోదాలు జరపగా, రూ.400 కోట్లకు పైగా అనధికారికంగా ఉన్న లావాదేవీలను వారు గుర్తించారు. దీంతో విషయం తెలుసుకున్న ఆ బీజేపీ నేత, రంగంలోకి దిగి, తనకు కేంద్రంలో పలుకుబడి ఉందని, మీకు సాహయం చేస్తాను అంటూ రంగంలోకి దిగారు. ఆ నేతకు తోడుగా, మరో నేత కూడా తోడయ్యారు. అందరూ కలిసి తిరుపతిలో మీటింగ్ అయ్యి, డీల్ కుదుర్చుకున్నారు. 30 కోట్లు ఇస్తే, ఈ కేసులో ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, డీల్ సెట్ చేసుకున్నారు. అంతా సాఫీగా జరిగిపోయినా, విషయం బయటకు పొక్కింది. కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగి, మొత్తం విషయం కూపీ లాగాయి. విషయం జాతీయ బీజేపీ అధిష్టానం వద్దకు చేరింది. ఆ ఇద్దరి నేతల వల్ల పార్టీ పరువు పోతుందని, అధిష్టానం భావించింది. వారి పై చర్యలు తీసుకునే, మరింతగా వారు చేసిన పనులు పై ఆధారాలు సేకిరించి, వారి పై వేటు కూడా వేస్తారని, నిన్న పత్రికలో వచ్చిన కధనం.
అయితే ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు అనేది మాత్రం ఆ పత్రిక రాయలేదు. ఒకరు కేంద్రంలో కేబినెట్ హోదా ఉన్న వ్యక్తి అని, అలాగే ఇంకొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరచూ వచ్చి వెళ్లే ప్రముఖ నేత అంటూ రాసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు వీరే అంటూ సిపిఐ రామకృష్ణ బాంబు పేల్చారు. అనంతపురంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన రామకృష్ణ, ఆశ్రమం పై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి, అక్రమ ఆస్తులు గుర్తించారని, ఇదే అదునుగా బీజేపీ నేతలు రంగంలోకి దిగారని, దీని కోసం ఇద్దరు నేతలు డీల్ కుడుర్చుకున్నారని, ఆ ఇద్దరు నేతలు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు అని, వారి పేర్లు బలంగా వినిపిస్తున్నాయని సిపిఐ రామకృష్ణ బాంబు పేల్చారు. కోట్ల రూపాయాలు సంపాదించిన దొంగ స్వాములతో, ఈ బీజేపీ నేతలు అంటకాగుతున్నారని వాపోయారు. తాను ఈ విషయం పై తిరుపతికి ఫోన్ చేసి అడిగితే, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు పేర్లు చెపుతున్నారని, ఈ కధనం వచ్చి 24 గంటలు అయినా, ఎవరూ ఖండించలేదని, వారిద్దరూ కాకపోతే, ఎందుకు ఇప్పటి వరకు ఎవరూ ఖండించలేదని ప్రశ్నించారు.