హైకోర్టు చెప్పింది, సుప్రీం కోర్టు చెప్పింది, రాజ్యాంగం చెప్పింది, గవర్నర్ చెప్పారు. అయినా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఇవ్వాల్సిన సహకారం అందించటం లేదు. ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదనలు ఏదో ఒక వంకతో, ప్రభుత్వం తిప్పి పంపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగ సంస్థ. అది ఏమీ ఒక వ్యక్తి కాదు అనే విషయం ప్రభుత్వానికి తెలిసినా, రాజ్యాంగ సంస్థకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ప్రభుత్వ తీరు పై రాష్ట్ర ఎన్నికల సంఘం అసహనం వ్యక్తం చేసింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్నియామకానికి సంబంధించి తాము సూచనలు చేసినా, ప్రభుత్వం వాటిని పట్టించుకో లేదు అంటూ ఎలక్షన్ కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ ప్రతిపాదనలు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకట్టు వేసినట్టు అర్ధం అవుతుందని ఘాటుగా రసారు. ప్రభుత్వం తమ సూచనలు పట్టించుకోక పోవటంతో, గుంటూరు జిల్లాకు ఎం.హరినారాయణ్, ఆలాగే చిత్తూరు జిల్లాకు పి.బసంత్‌కుమార్‌ను కలెక్టర్లుగా నియమిస్తూ, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలి అంటూ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసారు. తాము ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం తరుచూ లెక్క చేయకపోవటం పై, హైకోర్టుకు కూడా విన్నవిస్తామని తెలిపారు.
తాము సూచనలు చేసినా, గుంటూరు, చిత్తూర్ జిల్లాల కలెక్టర్ల ప్రతిపాదనను, ముందు ఏది పంపించారో, మళ్ళీ అదే తిప్పి పంపించారని, తమ సూచనలు పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ప్యానెళ్లలో ప్రతిపాదించిన నలుగురు పేర్లు లేకుండా చేసారని, ఆ పేర్లను మార్చినట్టు తెలుస్తుందని అన్నారు. ఈ వైఖరి చూస్తుంటే, తమ పట్ల ప్రభుత్వానికి ఎంత నిర్ల్యక్షం ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ప్రవీణ్ ప్రకాష్ ను తాము ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆదేశించిన దానికి ప్రతీకారంగా ఇది చేసినట్టు భావిస్తున్నాం అని అన్నారు. ఇక కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక్కసారి వచ్చి వెళ్ళారని, ఇప్పటి వరకు తమ కార్యాలయానికి రాలేదని తెలిపారు. ఇక ఇదే సమయంలో పోలీస్ శాఖ పై ప్రశంసలు కురిపించారు. తాము బదిలీ చేయమన్న పోలీస్ అధికారులను, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సూచనల మేరకు బదిలీ చేసి, ఆ స్థానంలో వేరే వారిని పెట్టారని, ఆ స్పూర్తి కలెక్టర్ల విషయంలో కొరవడిందని అన్నారు. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు కోర్టుకు వెళ్ళటంతో, కోర్టు ద్వారానే ఈ విషయం తేలే అవకాసం ఉంది.