విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, వైసీపీ ఎంపీల పై ధ్వజమెత్తారు. "కేంద్ర బడ్జెట్ 2021-22లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విఫలమయ్యారు. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారు. రాజ్యసభ సభ్యులతో కలిపి 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ హామీల అమలుకు ఎందుకు నిధులు రాబట్టలేకపోయారు? పార్లమెంట్ సమావేశాలు జరిగే ప్రతీసారి హోదా విషయంలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఏపీకి విభజన చట్టం హక్కులు, హామీలు ఉన్నా వాటి అమలుకు కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనలుగాని, కేటాయింపులుగాని లేకపోవడానికి బాధ్యత వహించి 28 మంది వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలి. మనకంటే ఎంతో మెరుగైన బెంగళూరు, చెన్నై, కోచితో పాటు మహారాష్ట్రంలోని నాగ్ పూర్, నాసిక్ లలోని మెట్రోరైల్ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్రంలోని మెట్రో రైల్ ప్రాజెక్టులకు నిధులు సాధించడంలో విఫలమయ్యారు. తమిళనాడుకు 1,03,000 కోట్ల వ్యయంతో 3,500కి.మీ మేర జాతీయ రహదారుల పనులు, కేరళలో 1100 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణాలకు రూ.65,000 కోట్లు కేటాయించారు. "
"టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర బడ్జెట్ లో ఇప్పటికన్నా మెరుగైన కేటాయింపులు ఉన్నా ఆనాడు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. గతంలో డిమాండ్ చేసిన విధంగానే మీరు ఇప్పుడు రాజీనామా చేయాలి. వైకాపా 28 మంది ఎంపీలు ఉండేది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికా? లేక జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కేసుల నుంచి బయటపడటానికి బేరాలు చేయడానికా? జగన్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై ఎందుకు నోరు మెదపడంలేదు? బడ్జెట్ లో ఆర్థికలోటు భర్తీ లేదు, 7 వెనుకబడిన జిల్లాలకు నిధుల్లేవు, అమరావతికి లేవు, పోలవరానికి నిధుల కేటాయింపులు లేవు. ఇది జగన్ రెడ్డి వైఫల్యం కాదా? ఢిల్లీ చుట్టూ పదేపదే ప్రదిక్షణలు చేసేది జగన్ రెడ్డి తన వ్యక్తిగత కేసుల మాఫీ కోసమే. తన వ్యక్తిగత స్వార్థం కోసం జగన్ రెడ్డి 5 కోట్ల మంది ఏపీ ప్రజల ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టారు. తక్షణమే వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలి. " అంటూ నాని ధ్వజమెత్తారు.