కుల, మత విద్వేషాలను రెచ్చకొట్టేందుకు ప్రయత్నించారని, కుల దూషణ అభియోగాలు మోపి, పశ్చిమ గోదావవరి జిల్లా పోడూరు, భీమవరం టూటౌన్, పెనుగొండ, ఆచంట తదితర పోలీస్ స్టేషన్లలో పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణం రాజుపై ఈ నెల 22వ తేదీ వరకు చర్యలు తీసుకోరాదని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్మి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని వాటిని కొట్టివేయాలని రఘురామ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గురువారం జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు. రఘురామకృష్ణం రాజుపై లెక్కకు మిక్కిలి కేసులు నమోదు కావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసుల తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా తన పేరిట ఉత్తర్వులు వెలువడనున్నట్లు సీనియర్ న్యాయవాది ఎస్సీత్యనారాయణ న్యాయమూర్తికి వివరించారు. సోమవారం లోపు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కేసును ఈనెల 22వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకు రఘురామపై చర్యలు తీసుకోరాదని ఆదేశించారు. తనని తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వటం లేదు అంటూ, రఘురామ రాజు గత కొంత కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే విషయం పై ఆయన గత కొంత కాలంగా సొంత ప్రభుత్వం పైనే ఆరోపణలు చేస్తున్నారు. తాను తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు బయలుదేరితే అడ్డుకోవటానికి చూస్తున్నారు అంటూ, తాను జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసానని, రెండు రోజులుగా ఆయన కోసం ప్రయత్నం చేసినా, ఫలితం లేకపోయిందని గతంలో ఆరోపించారు. ఒక ఎంపీ తన నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఎందుకు ఉందో ఆలోచించాలి అంటూ, ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయం పై, తన పై కేసులు పెట్టి, అరెస్ట్ చేయాలని కూడా చూస్తున్నారు అంటూ, ఆయన హైకోర్టుకు వెళ్ళారు. దీని పై నిన్న స్పందించిన హైకోర్టు, ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ, ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే విషయం పై నిన్న రఘురామరాజు, పార్లమెంట్ లో కూడా లేవనెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఈ విషయం పై తనకు న్యాయం చేయాలని కోరారు. అంతే కాదు, పార్లమెంట్ కూడా, తన ఆవేదన అర్ధం చేసుకోవాలని నిన్న పార్లమెంట్ లో ప్రసంగించారు.