తిరుమలేశుని నగల విషయంలో వస్తున్న ఆరోపణలు, రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాలు, ప్రజల్లో శ్రీవారి నగల పై ఆందోళన నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు రాజకీయ పార్టీల నోరు మూపిస్తూ, మరో పక్క ప్రజల్లో విశ్వాసం నింపటానికి కీలక నిర్నయం తీసుకున్నారు. బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో, ఈ అంశం తీసుకుని, తిరుమల గుడి కొట్టేసే ప్రయత్నం చెయ్యటం కూడా చూస్తున్నాం. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జిని నియమించి... సమగ్ర ధ్రువీకరణ చేయించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను కోరారు. దీనిపై బుధవారం ముఖ్యామంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ కు ఒక లేఖ రాశారు.
‘‘తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదైవం. అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామివారిని కొలుస్తారు. స్వామివారి దగ్గర పాటించే ఆచారాలు అత్యంత పవిత్రం. వెలకట్టలేని నగలు, ఆభరణాలు, ఆస్తులు స్వామివారి సొంతం. అవి దొంగతానికి గురైనట్లు, దుర్వినియోగం జరిగినట్లు ఇటీవల కాలంలో పలువురు ఆరోపణలను వెల్లువెత్తించారు. స్వార్థం, స్వప్రయోజనాల కోసమే కొందరు ఈ పనిచేశారు. అంతా బాగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, ప్రభుత్వం చేసిన ప్రకటనలు ప్రజలు, ముఖ్యంగా భక్తుల మనసులకు సాంత్వన కలిగించలేదు. ఇది అత్యంత సున్నితమైన, భక్తుల భావోద్వేగాలతో ముడిపడిన విషయం. అందుకే ఈ విషయంలో వచ్చిన ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర ధ్రువీకరణ జరిపించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.
ఆ నివేదికను బహిరంగంగా ప్రజల ముందు పెట్టి ఈ వివాదానికి ముగింపు పలకాలన్నారు. స్వార్థపూరిత ఆరోపణలతో వెంకన్న భక్తుల్లో లేనిపోని ఆందోళనలు రేకెత్తించారని చంద్రబాబు తెలిపారు. గతంలో టీటీడీపై ఇలాంటి ఆరోపణలే వచ్చినప్పుడు కొన్ని కమిటీలు వేసినట్లు గుర్తు చేశారు. ‘‘2009లో జస్టిస్ జగన్నాథరావు కమిషన్, 2011లో జస్టిస్ వాద్వా కమిటీలను స్వామివారి ఆభరణాలు పరిశీలించేందుకు వేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మళ్లీ తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తుల్లో ఉన్న భయాందోళనలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ధ్రువీకరణ చేయించాలి. రికార్డులు పరిశీలించేందుకు, వెలకట్టలేని నగలు, ఆభరణాలు, ఆస్తులను తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించాలి. స్వామివారికి కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయో లేదో కూడా ధ్రువీకరించాలి. అన్నీ పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’’ అని చంద్రబాబు తన లేఖలో తెలిపారు.