పోలవరం ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పై కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని రిపోర్ట్ ఇవ్వమని కోరింది. పోలవరం కాంట్రాక్టులను రద్దు చేయడం, రీటెండర్లను ఆహ్వానించడం పై, పోలవరం ప్రాజెక్ట్ కు తలీత్తే ఇబ్బందుల పై, పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18 పేజీల రిపోర్ట్ ని, కేంద్రానికి ఇచ్చింది. అయితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ లో లేవనెత్తిన అంశాల పై, మీ వివరణ ఇవ్వండి అంటూ కేంద్రం, జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్ కుమార్ శ్రీవాస్తవ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన 18 పేజీల నివేదికతో పాటుగా, రాష్ట్రం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను కూడా దీంతో కలిపి పంపించారు.
అయితే పోలవరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వ విధానాన్ని, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ వివరణ ఇచ్చారు. గత సోమవారం ఢిల్లీలో స్వయంగా జగన్ వెళ్లి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి వివరించినా సరే, ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరడం గమనార్హం. పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు పెరగకుండా చూస్తామని, అలాగే ఆలస్యం అవ్వకుండా చూస్తామని, కొత్త టెండర్లకు అనుమతి ఇవ్వాలని జగన్ ఇచ్చిన వివరణ పై కేంద్రం సంతృప్తి చెందలేదని ఈ లేఖలు చూస్తే తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ పై రాష్ట్రప్రభుత్వం రిటెన్ గా జవాబు ఇవ్వాలని అధికార వర్గాలు చెప్తున్నాయి. వచ్చే రెండు రోజులు, వినాయక చవితి సెలవులు ఉన్నాయి కాబట్టి, సెప్టెంబరు 3, 4 తేదీల్లో జవాబు పంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ చెబుతోంది.
మరో వైపు, ఈ నెల 23న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ 18 పేజీల రిపోర్ట్ పంపినా, మరింత సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖ తాజాగా ఆదేశించింది. ఇక మరో పక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అటు కోర్ట్ ని కాని, ఇటు కేంద్రం మాట కాని లెక్క చెయ్యకుండా,రీటెండరింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే హైకోర్ట్ రీటెండరింగ్ కు వెళ్ళద్దు అని చెప్పింది. దీని పై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్ళింది. ఈ నేపధ్యంలో అప్పీల్ కు వెళ్ళాం కాబట్టి, రీటెండరింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసామని, కోర్ట్ ఆదేశాలను బట్టి చూస్తాం అని ప్రభుత్వం అంటుంది. మరో పక్క, కోర్ట్ వద్దు అని చెప్తున్నా, ఇలా ముందుకు వెళ్ళటం తప్పు అని కొంత మంది న్యాయవాదాలు అంటున్నారు.