వైఎస్ జగన్కు ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి షాకిచ్చారు. ఎన్నికల ప్రచారం నుంచి అకస్మాత్తుగా ఆయన కనిపించకుండాపోవడం ఒంగోలు వైసీపీని షాక్కు గురిచేసింది. గత ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డి మళ్లీ టికెట్ తనదేనని భావించారు. అయితే.. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పార్టీలో చేర్చుకున్న జగన్.. ఆయనకు ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని ఖరారు చేశారు. ఈ పరిణామంతో కంగుతిన్న వైవీ సుబ్బారెడ్డి జగన్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్ తనకు టికెట్ కేటాయించకపోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమై ఉండొచ్చని వైవీ అనుమానంతో ఉన్నట్లు సమాచారం
ఇక మరో పక్క ఒంగోలు పార్లమెంట్ లో రసవత్తర పోరు జగుతుంది. ఒంగోలు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా తొలుత మాగుంట పేరే ఖరారైంది. కానీ ఐటీ, సీబీఐ దాడుల భయంతో ఆయన ఆకస్మికంగా వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీకి ఈ సీటే పొందడం గమనార్హం. ఆయన్ను సమర్థంగా ఎదుర్కోవడానికి సీఎం చంద్రబాబు వ్యూహరచన చేశారు. దర్శి టీడీపీ అభ్యర్థి, మంత్రి శిద్దాను ఒంగోలు పార్లమెంట్ బరిలోకి దించారు. జనసేన తన అభ్యర్థిగా బెల్లంకొండ సాయిబాబాను పోటీకి నిలిపినా.. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ నడుమే ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఇక్కడ పోటీచేసి.. మాగుంటపైనే గెలిచిన జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి.. ఈ సారి తనకు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వర్గం ఏ దశలోనూ మాగుంటకు సహకరించడం లేదు. లోక్సభ నియోజకవర్గ పరిధిలో బీసీలు, దళిత ఓటర్లు అత్యధికం. అగ్రవర్ణాల్లో రెడ్డి సామాజిక ఓటర్లు అధికం. ఆ తర్వాత కమ్మ, కాపు ఓటర్లు ఇంచుమించు సమానం. ముస్లిం, ఆర్యవైశ్య ఓటర్లు అటు ఇటుగా సమాన స్థాయిలో ఉన్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం సామాజిక సమతూకం పాటించిందని విశ్లేషకులు అంటున్నారు.