ప్రధాని మోదీ మంత్రివర్గంలో అనూహ్యంగా విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి పద్మశ్రీ సుబ్రమణ్యం జయశంకర్‌కు చోటు దక్కింది! 2015-18 మధ్య విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ప్రధాని ఏరికోరి మంత్రిని చేశారని చెబుతున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో దేనికీ ప్రాతినిధ్యం వహించనప్పటికీ... ఆయన రాయబార ప్రతిభను గుర్తించి ఈ పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది. డోక్లాంలో భారత్-చైనా సేనల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడలో కీలకంగా వ్యవహరించడం జయశంకర్‌కు మంచి పేరు తెచ్చింది. పలు దేశాల్లో భారత రాయబారిగా పనిచేయడం ఆయనకు బాగా కలిసొచ్చింది. ఇప్పటివరకూ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్ మరోసారి పదవి చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయనందున... ఆ శాఖను జయశంకర్‌కు అప్పగిస్తారని భావిస్తున్నారు.
జనవరి 9, 1955న జన్మించిన సుబ్రమణ్యం జయశంకర్... రాజనీతిశాస్త్రంలో ఎంఏ చేశారు. అనంతరం దిల్లీలోని జేఎన్‌యూ నుంచి ‘అంతర్జాతీయ సంబంధాలు’పై ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేశారు. 1977 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన... ‘ఇండియన్ మిషన్ టు సోవియట్ యూనియన్’లో 1979-1981 మధ్య కార్యదర్శిగా పనిచేశారు. చెక్ రిపబ్లిక్ (2001-04), చైనా (2009-13), అమెరికా (2014-15)ల్లో భారత రాయబారిగా పనిచేశారు. 2007-09 మధ్య సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గానూ సేవలు అందించారు. 2007లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్-అమెరికా మధ్య పౌర అణు ఒప్పందం విషయంలో కీలకపాత్ర పోషించారు కూడా! కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా... తనకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తిస్తారని జయశంకర్‌కు పేరుంది. రాయబారిగా నియమించే సమయంలో సీనియర్లను కాదని ఆయనకు బాధ్యతలను అప్పగించిన సందర్భాలు కూడా లేకపోలేదు. విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా నిరుడు పదవీ విరమణ పొందిన తర్వాత టాటా గ్రూపు అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షునిగా జయశంకర్ బాధ్యతలు చేపట్టారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించడం విశేషం.