భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మోదీతో పాటు బీజేపీ-సారథ్యంలోని ఎన్డీఏ సర్కారులో మొత్తం 57 మందికి మంత్రులుగా అవకాశమిచ్చారు. వీరిలో 36 మంది గతంలో చేసినవారే కాగా 21 మంది కొత్తవారు. మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్ హోదా ఇచ్చారు. 9 మందికి స్వతంత్ర ప్రతిపత్తితో మంత్రులను చేశారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం రోజున మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయింపు జరిగింది. తెలంగాణ నుంచి గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ కిషన్‌రెడ్డిని హోం శాఖ సహాయ మంత్రిగా కేంద్రం కేటాయించింది. తెలుగు రాష్ట్రాల నుంచి జరిగిన ఒకే ఒక నియామకం ఇది. కేంద్ర హోంశాఖ అమిత్ షాకు కేంద్రం కట్టబెట్టింది.
కాగా.. తెలంగాణ నుంచి మోదీ తన కేబినెట్లోకి కిషన్ రెడ్డిని తీసుకుంటారా..? లేదా..? అనే దానిపై చివరి క్షణం వరకూ ఢిల్లీలో సస్పెన్స్ కొనసాగింది. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి పిలుపు వస్తుందని పార్టీ ముఖ్య నేతలు భావించినా బుధవారం రాత్రి వరకు రాలేదు. గురువారం ఉదయానికి నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి తీపి కబురు వినిపించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారీ తెలంగాణకు (ఉమ్మడి ఏపీలో కూడా) తొలుత సహాయ మంత్రి పదవే దక్కుతోంది. ఇది ఆనవాయితీగా మారిందని కమలం రాష్ట్ర పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో ఇద్దరు సీనియర్ నాయకులకు కూడా సహాయ మంత్రిగానే అవకాశం దక్కగా.. ఇప్పుడు కిషన్ రెడ్డికి కూడా సహాయ మంత్రి హోదానే ఇచ్చిన సంగతి తెలిసిందే.