ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎలా చెప్పవచ్చు అంటే, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుల,మత,ప్రాంత, ఉద్యోగ సంఘనేతలకి పిలుపులు వస్తున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి చూసే భాగ్యం కాదు ఆయన సలహాదారుడు సజ్జలని చూసే అదృష్టానికి మూడున్నరేళ్లుగా నోచుకోని వివిధ సంఘాల నేతల వద్దకే ఆయన వస్తున్నారు. నిన్న మైనారిటీల సమావేశం నిర్వహించారు. మొన్న బీసీల కార్పొరేషన్లు పాత కమిటీలేనంటూ ప్రకటించారు. బీసీ సదస్సు పెట్టి చేసిన హడావిడి చూశాం. ఉద్యోగసంఘ నేతలు కూడా ప్రాంతాల వారీగా పర్యటిస్తూ తాము జగన్ బంట్లుమే అంటూ బాహాటంగా ప్రకటిస్తున్నారు. లేటెస్ట్ గా ఎస్సీ కీలక నేతలతో వైసీపీ సలహాదారుడు సజ్జల సమావేశం అయ్యాడు. రాష్ట్ర, జిల్లా వైసీపీ ఎస్సీ కమిటీలను నియమిస్తామని, వాఆరు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి జనంలోకి వెళ్లి వివరిస్తారని, ఏప్రిలో ఎస్సీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ ప్రకటించారు. మూడున్నరేళ్లు ఏ కులానికి కనిపించలేదు, ఏ మతానికి ఏమి ఇవ్వలేదు. ఏ ప్రాంతంలోనూ ఒక ఇటుక పెట్టింది లేదు. ఇచ్చిన హామీలు వద్దు, ఒకటో తారీఖుకి జీతం ఇస్తే చాలంటూ ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో కుల సంఘాల సమావేశాలు, వారికి తాయిలాలు ప్రకటిస్తున్న తాడేపల్లి పెద్దలు ఎన్నికల నగారా త్వరలోనే మోగనుందని చెప్పకనే చెప్పారు.
news
ప్రకాశం క్లీన్ స్వీప్ చేస్తామన్న బాలినేని మాట నిలబెట్టుకునేలా ఉన్నారు..
కొన్ని నెలల క్రితం అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సడెన్ గా కోపం వచ్చింది. తనని హవాలా మంత్రి అంటున్నారని భీషణ ప్రతిజ్ఞ పూనారు. ప్రకాశంజిల్లాలో టిడిపి లేకుండా క్లీన్ స్వీప్ చేస్తానని మీడియాసాక్షిగా ప్రకటించారు. అనతికాలంలోనే ఆయన మంత్రి పదవి పోయింది. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పోస్టు ఇచ్చారు. మంత్రిగా బాలినేని హుందా, పదవి పోయాక పోయింది. వైరాగ్యపు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అసలు విషయం వేరే ఉందని టాక్. బాలినేని ఇప్పటికే అసంతృప్తిలో ఉన్నారనే వార్తలు అనేక సార్లు వచ్చాయి. పది రోజుల క్రితం, తన భార్యకు టికెట్ ఇస్తే, తాను పొటీ చేయనని చెప్పేసారు. బాలినేని పరిస్థితి ఇలా ఉంటే, మిగతా వైసీపీ నాయకులు తీరు చూస్తుంటే ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ అయ్యేది వైసీపీయేనని స్పష్టం అవుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని, కందుకూరు మానుగుంట మహీధర్ రెడ్డి, సంతనూతలపాడు సుధాకర్ బాబు, గిద్దలూరు అన్నా రాంబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఏ పార్టీలో చేరుతారో తెలియదు కానీ, వైసీపీలో ఉండే అవకాశంలేదని వైసీపీలోనే జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు టిడిపి నుంచి వైసీపీకి జంప్ కొట్టిన జిలానీలు మళ్లీ టిడిపిలోకి రావాలని దారులు వెతుకుతున్నారట. చీరాలకి చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు టిడిపిలో మళ్లీ చేరాలని ఉవ్విళ్లూరుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరణం బలరాం ఇక్కడ ఆల్రెడీ కర్చీఫ్ వేసే అక్కడికి వెల్లారని, ఎన్నికలకి ముందు మళ్లీ టిడిపిలోకి వస్తారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లీన్ స్వీప్ వ్యాఖ్యలు రివర్సయి వైసీపీ క్లీన్ స్వీప్ అయ్యే చాన్స్‌లే ఎక్కువ కనపడుతున్నాయి.
ఆ వైసీపీ ఎమ్మెల్యేల భద్రత తగ్గింపు వెనుక ఇంత స్టొరీ ఉందా ?
వైసీపీలో ఒక్కో ఎమ్మెల్యే తిరుగుబాటు పడుతున్నారు. నోరెత్తినవాళ్లని అన్నిరకాలుగా ఇబ్బందులకి గురిచేసి, భయపెట్టి కొత్త వారు అసమ్మతిగళాలు వినిపించకుండా వైసీపీ పెద్ద ప్లానే వేసింది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వెనువెంటనే ఆయన భద్రత తగ్గించేశారు. నియోజకవర్గ బాధ్యతలు ఇంకొకరికి కట్టబెట్టారు. తన ప్రాణాలకు హాని ఉందని తెలిసే సెక్యూరిటీని ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో ఇరకాటంలో పడిన సర్కారు ఆయనపై ముప్పేట దాడులు మొదలు పెట్టింది. ఫోన్లు చేసి బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడం, భద్రత తగ్గించడం వంటి కక్ష సాధింపు చర్యలకు దిగింది ప్రభుత్వం. తన భధ్రత తగ్గించడంతో ఉన్న గన్మెన్లను ప్రభుత్వానికి కోటంరెడ్డి సరెండర్ చేశారు. అదే సమయంలో కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిని వైసీపీ నేతలు బండబూతులు తిడుతున్నారు. వైసీపీ సోషల్‌మీడియాలో చాలా ఘోరంగా ఈ ఇద్దరిపై పోస్టులు పెడుతున్నారు. బోరుగడ్డ అనిల్ వంటివారైతే ఇంటికొచ్చి కొడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే వైసీపీపై ఆరోపణలు చేసే ప్రజలైనా, ప్రతిపక్షం అయినా, సొంత పార్టీ నేతలైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించడానికే ఇటువంటి బరితెగింపు చర్యలకు ప్రభుత్వం దిగుతోందని అర్థం అవుతోంది. వైసీపీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకి భద్రత ఉపసంహరించడం, బోరుగడ్డ అనిల్ ఉదంతంతో అసలు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. తనపై తిరగబడితే ఆనం, కోటంరెడ్డిలాగే భద్రత ఉండదని, దా-డు-లు తప్పవని హెచ్చరించడానికే ఈ ప్రమాదకరమైన పోకడ ఎంచుకున్నారని ఆనం, కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు
లోకేష్ పాదయాత్రపై వైసీపీ దండయాత్ర
యువగళం నొక్కేందుకు గరళం చిమ్ముతోంది వైసీపీ. అడ్డుకునే ప్రయత్నాలు విఫలం అవడంతో అడ్డదారి వేధింపులకు తెరతీశారు. కుప్పంలో ప్రచారరథం సీజ్ చేశారు. పలమనేరు నియోజకవర్గంలో లైవ్ ఎక్విప్ మెంట్, సౌండ్ సిస్టమ్, ప్రచారరథం ఎత్తుకుపోయారు. లోకేష్‌తోపాటు కీలక టిడిపి నేతలపై కేసులు బనాయించారు. పాదయాత్రలో యాక్టివ్ గా ఉన్న వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకి పోలీసులే వత్తాసు పలుకుతున్నారు. బ్యానర్లు చించేస్తున్నారు. అడిగితే దాడులకు తెగబడుతున్నారు. పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు కావడంతో వైసీపీ గూండాల కంటే ఘోరంగా టిడిపి వాళ్లను టార్గెట్ చేశాడని టిడిపి నేతలే ఆరోపిస్తున్నారు. మైక్ నిషేధం, ప్రచారరథం నిషేధం, రోడ్డుపై ఆగకూడదంటూ సవాలక్ష నిబంధనలు పేరుతో నోటీసులు ఇస్తున్నారు. పాదయాత్రతో యువత, వివిధ కుల సంఘాలతో లోకేష్ జరుపుతున్న సమావేశాలు చాలా విజయవంతం అవుతున్నాయని, చాలా ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ నివేదికలు అందాయి. దీంతో పాదయాత్ర మొత్తం నిఘానీడలోకి వెళ్లిపోయింది. పాదయాత్రలో మఫ్టీలో పోలీసులు లోకేష్ ప్రసంగాలను లైవ్ చేస్తున్నారు. కులసంఘాల సమావేశాలలో ఏఏ అంశాలు ప్రస్తావిస్తున్నారో రికార్డు చేసుకుని నివేదిక అందిస్తున్నారు. చివరికి పాదయాత్రకి స్వాగతం పలుకుతూ ఎవరెవరు బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో కూడా వీడియోలు, ఫోటోలు తీసి కేంద్రకార్యాలయానికి ఇంటెలిజెన్స్ పోలీసులు పంపుతున్నారు. పాదయాత్రని అడ్డుకునేందుకు లోకల్ పోలీసులు వైసీపీ కంటే ఘోరంగా తాపత్రయపడుతుంటే, వైసీపీ పేటీఎం బ్యాచులు..పాదయాత్రపై విషం చిమ్మేందుకు తప్పుడు పోస్టులు పెడుతున్నారు. వైసీపీ నేతలు ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ బ్రాండ్ బూతుభాషతో విరుచుకుపడుతున్నారు. ఇవ్వన్నీ చూస్తుంటే లోకేష్ చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోందని, పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైసీపీ ఇటువంటి తప్పుడు ప్రచారాలకు దిగుతోందని అందరికీ అర్థం అయ్యింది.