వైసీపీకి తిరుగులేని సీట్లు, ఓట్లు తెచ్చిన నెల్లూరు జిల్లాలో తిరుగుబాట్లు మొద‌ల‌య్యాయి. నెల్లూరు పెద్దారెడ్లు త‌మ పార్టీ అధినేత‌పైనే తిరుగుబాటు జెండా ఎగ‌రేస్తున్నారు. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి గ‌త కొద్దిరోజులుగా స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రెండు రోజులుగా వైసీపీ అధిష్టానంపై ధిక్కార‌స్వ‌రం పెంచేశారు. త‌న ఫోన్ ట్యాప్ చేశార‌ని, త‌న త‌మ్ముడిని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించాల‌ని చూస్తున్నార‌ని వైసీపీపై ఆరోప‌ణ‌లు చేశారు. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి నెల్లూరు రూర‌ల్ సీటుపై పోటీ చేస్తానంటూ ఆడియో కూడా వైర‌ల్ చేశారు. అటువైపు నుంచి కోటంరెడ్డి ఎటాక్ స‌మ‌యంలోనే నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌న‌ను రాజకీయంగా ఎదుర్కోలేక... చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ పెద్ద‌ల్ని టార్గెట్ చేశారు. వైసీపీ స‌ర్కారు తన ఫోన్ ట్యాప్ చేస్తోందంటూ ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి వెల్ల‌డించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనైన  త‌న ఫోన్ ట్యాప్ చేయ‌డంతో చివ‌రికి తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటే వాట్సాప్ కాల్స్ చేసుకుంటున్నాన‌ని వాపోయారు.  మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు, అందులోనా సీఎం సామాజిక‌వ‌ర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ప‌ట్ట‌డంతో ఒక్క‌సారిగా రాష్ట్రంలో స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. మ‌రింత మంది అస‌మ్మ‌తి గ‌ళం ఎత్తే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

కోడిక‌త్తితో గుచ్చించుకుని సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేశార‌ని అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షనేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. కోడిక‌త్తి దాడి ప్లాన్ చేసుకున్నార‌ని ముందుగానే హీరో శివాజీ వెల్ల‌డించారు. అయినా వెన‌క్కి త‌గ్గ‌కుండా విశాఖ ఎయిర్ పోర్టు కేంద్రంగా కోడిక‌త్తి దా-డి జ‌రిగిపోయింది. అయితే కోడిక‌త్తి దాడిలో గాయ‌ప‌డిన జ‌గ‌న్ రెడ్డికి వైద్యం ఏపీలో జ‌ర‌గ‌కుండా ప్లాన్ చేశార‌ని అనుమానాలున్నాయి. హైద‌రాబాద్లో గాయానికి కుట్లేసిన డాక్ట‌ర్ కి గ‌వ‌ర్న‌మెంటు వ‌చ్చాక‌ కేబినెట్ ర్యాంకు ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం అనుమానాల‌కు బ‌లం చేకూర్చింది. ఏపీలో విచార‌ణ జ‌ర‌గ‌కుండా చూసుకున్నార‌ని అప్ప‌టి ప్ర‌భుత్వంలో పెద్ద‌లు ఆరోపించారు. ఈ కేసు విచార‌ణ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీకి బ‌దిలీ అయ్యింది. దాదాపు నాలుగేళ్ల త‌రువాత  కోడి కత్తి కేసు విచారణ ఆరంభ‌మైంది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచార‌ణ‌కి కోడిక‌త్తి శ్రీను హాజ‌రు కాగా, సాక్షి విశాఖ ఎయిర్‌పోర్టు ఉద్యోగి దినేష్ కుమార్ గైర్హాజరు అయ్యాడు. వ‌చ్చే వాయిదాలో విచారణకు కోడిక‌త్తి దాడిలో గాయ‌ప‌డిన విక్టిమ్ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి కూడా  హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఫిబ్రవరి 15వ తేదీకి  వాయిదా వేస్తున్న‌ట్లు న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో సానుభూతి కోసం, పీకే ప్లాన్ ప్ర‌కారం కోడిక‌త్తి స్కెచ్ వేసుకుంటే, చివ‌రికి అది సీఎం అయ్యాక త‌న మెడ‌కు చుట్టుకుంటుంద‌ని జ‌గ‌న్ ఊహించ‌లేక‌పోయార‌ని, ఇప్పుడు కోర్టుకి హాజ‌రు కాకుండా ఉండేందుకు ఎలా ప్ర‌య‌త్నిస్తారోన‌ని విప‌క్షాలు ఎదురుచూస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ గ‌ళం ప‌ట్టాభి. వైసీపీ అవినీతి, అక్ర‌మాల‌పై గ‌ర్జించే అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్. ఆ వాయిస్ ని త‌ట్టుకోలేక వైసీపీ దా-డు-లు చేయించింది. నీచ‌మైన ట్రోలింగ్ పాల్ప‌డింది. అయినా ఒక్క ఇంచు కూడా త‌గ్గ‌ని నిజాయితీ, టిడిపి ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌తో కూడిన నైజం ప‌ట్టాభిది. దాడుల‌తో భ‌య‌పెట్ట‌లేక‌పోయారు. అక్ర‌మ‌కేసుల‌తో లొంగ‌దీసుకోలేక‌పోయారు. బూతులతో ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీయాల‌నుకున్నారు. తెలుగుదేశం ప‌ట్టాభి పంతం ముందు నిల‌వ‌లేక‌పోయారు. అందుకే ఇప్పుడు ప‌రువున‌ష్టం పేరుతో పట్టాభి గ‌ళానికి క‌ళ్లెం వేయాల‌ని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేశారు. సంకల్ప్‌ సిద్ధి సంస్థ కేసులో పట్టాభి చేసిన త‌న‌పై చేసిన ఆరోపణలతో ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం వాటిల్లింద‌ని ఈ కేసుని వంశీ దాఖ‌లు చేశారు. సంకల్ప్‌ సిద్ధి గొలుసుక‌ట్టు స్కీం పేరుతో దాదాపు వెయ్యి కోట్ల‌కు పైగానే దోచేసిన మోస‌గించిన దానిపై కేసులు న‌మోద‌య్యాయి. సంక‌ల్ప‌సిద్ధి భాగ‌స్వాములైన గుత్తా  వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్‌లు కొడాలి నాని, వల్లభనేని వంశీల బినామీలని పట్టాభి ఆరోపించారు. సంక‌ల్ప‌సిద్ధిలో పెట్టిన సొమ్ముని వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని వాడుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.  దీనిపై అప్ప‌ట్లోనే డీజీపీని కలిసి వంశీ ఫిర్యాదు చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల‌ని, లేదంటే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వ‌ల్ల‌భ‌నేని ప‌ట్టాభికి నోటీసులు పంపించారు. తాజాగా పరువునష్టం దావా వేశారు.

వైసీపీని అధికారంలోకి తేవ‌డం కోసం, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎంని చేయ‌డం కోసం తాను శ్రీవారి స‌న్నిధిలో ప్ర‌ధాన అర్చ‌కుడిని అనే సంగ‌తీ మ‌రిచిపోయి వైసీపీ పేటీఎం బ్యాచులా దిగ‌జారి ప్ర‌వ‌ర్తించిన ర‌మ‌ణ దీక్షితులుకి జ‌గ‌న్ పాల‌న‌లో త‌త్త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. వైరాగ్యం ఆవహించిన‌ట్టుగా ట్వీట్లు వేస్తున్నాడు. గ‌ద్దెపై కూర్చోబెట్ట‌టానికి క్రైస్త‌వ మిష‌న‌రీలు న‌డిపేవాళ్ల‌తో క‌లిసి కుట్ర‌లు న‌డిపిన ర‌మ‌ణ‌దీక్షితులు ఇప్పుడు దేవుడి కోసం మొస‌లి క‌న్నీరు కారుస్తున్నాడు. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబుపై లేని పింక్ డైమండ్ ఆరోప‌ణ‌లకీ ఆల‌య అర్చ‌కుడై ఉండీ బ‌రితెగించాడు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆల‌యాల‌పై దా-డు-లు జ‌రిగినా స్పందించ‌ని ర‌మ‌ణ‌దీక్షితులు, త‌నవ‌ర‌కూ వ‌చ్చిందేమో ఇబ్బంది..ఇప్పుడు నోరిప్పుతున్నారు. అంత‌ర్వేది ర‌థం కాల్చివేస్తే మౌనం, రామ‌తీర్థంలో రాముడి త‌ల ఎత్తుకుపోతే నిశ్శ‌బ్దం, పిఠాపురంలో దేవ‌త‌ల విగ్ర‌హాలు ధ్వంస‌మైతే నో కామెంట్, దుర్గ‌మ్మ వెండి సింహాలు మాయ‌మైతే నోరిప్పితే ఒట్టు. మ‌రిప్పుడు ర‌మ‌ణ‌దీక్షితులుకి ఆగ‌మాల‌ని ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, దేవాల‌యాలలో ప‌రిస్థితులు భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌లిగిస్తున్నాయ‌ని, వీఐపీ సేవ‌లో ప్ర‌భుత్వం త‌రిస్తోంద‌ని ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు. ట్వీట్ చేసి రెండు మూడు గంట‌ల త‌రువాత ఆ ట్వీట్ ని ర‌మ‌ణ‌దీక్షితులు డిలీట్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read