సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని, ఆయ‌న పార్టీ వైసీపీని కేసులు చుట్టుముడుతున్నాయి. పాత‌కేసుల‌తోపాటు కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప‌రిపాల‌న వైపు దృష్టి సారించ‌లేక‌, పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్ట‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ కేసులు, వివాదాలు కొన్ని తెచ్చి పెట్టుకున్న‌వి అయితే, మ‌రికొన్ని ప్ర‌భుత్వంలో ఉన్నందువ‌ల్ల ఎదుర్కొంటున్న‌వి. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ల‌క్ష‌ల కోట్లు అక్ర‌మంగా ఆర్జించార‌ని రాజ‌కీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల‌పై న‌మోదైన సీబీఐ, ఈడీ కేసులు ఏళ్లుగా విచార‌ణ సాగుతోంది. అప్ప‌టి కేంద్రంలోకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ఏపీలోని టిడిపితో క‌లిసి ఈ కేసులు బ‌నాయించార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. దాదాపు ప‌దేళ్లుగా సీబీఐ, ఈడీ కేసులు కోర్టుల్లో వివిధ ద‌శ‌ల్లో విచార‌ణ‌కి కూడా ఇంకా రాలేదు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు 2019లో జ‌రిగిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్యపై అప్ప‌ట్లో జ‌గ‌నే సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక సీబీఐ ద‌ర్యాప్తు డిమాండ్ నుంచి వెన‌క‌డుగు వేశారు. అయితే వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత కోర్టుల్లో వ్యాజ్యం వేసి సీబీఐ ద‌ర్యాప్తు సాధించారు. సీబీఐ ద‌ర్యాప్తు అటు తిరిగి ఇటు తిరిగి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోద‌రుడైన వైఎస్ అవినాశ్ రెడ్డిని విచార‌ణ‌కు పిల‌వ‌డంతో ఈ కేసు జ‌గ‌న్ మెడ‌కే చుట్టుకుంటోంద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. 2018లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ హైద‌రాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చి వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్ జ‌నిప‌ల్లి శ్రీనివాస‌రావు సెల్ఫీ తీసుకుంటానని వచ్చి కోడి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే జగన్ భుజానికి గాయమైంది.

jagan sad 02022023 2

అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఉన్న చంద్ర‌బాబుపై త‌మ‌కు న‌మ్మ‌కంలేద‌ని, ఎన్ఐఏ ద‌ర్యాప్తు డిమాండ్ చేశారు. దీనిపై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ కేసు న‌మోదు చేసింది. దీని ద‌ర్యాప్తు నాలుగేళ్ల త‌రువాత ఇప్పుడు విజ‌య‌వాడ ఎన్ఐఏ కోర్టులో ప్రారంభ‌మైంది. ఈ కేసులో బాధితుడైన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోర్టుకి హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మ‌రోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో అది మ‌రో కేసులా వైసీపీ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం ఉంది. నెల్లూరు కోర్టు ప‌త్రాలు మాయం అయిన కేసులో సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించ‌డంతో వైసీపీ కేబినెట్లో మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇదీ వైసీపీకి సంబంధంలేని కేసు అయినా మంత్రిపై ఆరోప‌ణ‌లు రావ‌డం చికాకు క‌లిగించేదే. ఢిల్లీ మ‌ద్యం కేసులోనూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి సోద‌రుడు శ‌ర‌త్ చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి సంబంధాలు ఉండ‌డంతో మ‌నీల్యాండ‌రింగ్ కేసులోనూ వైసీపీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది. మ‌రోవైపు దేశంలోనే అతి ఎక్కువ కోర్టు ధిక్క‌ర‌ణ కేసులు ఏపీ స‌ర్కారుకి గుదిబండ‌లా త‌యార‌య్యాయి. కేసుల‌తో అధినేత‌, నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతుండ‌డంతో వైసీపీలో ఆందోళ‌న‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది.

వైసీపీలో ముస‌లం మ‌రిన్ని జిల్లాల‌కు పాకింది. నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం, మేక‌పాటి క‌ల‌క‌లం స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం వైసీపీ ముస‌లం మొద‌లైంది. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన  గన్నవరం వైసిపి నాయకులు దుట్టా రామచంద్రరావు , యార్లగడ్డ వెంకట్రావు సంభాషణలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల నాటికి ఉప్పు-నిప్పుగా ఉన్న యార్ల‌గ‌డ్డ‌, దుట్టాలు వ‌ల్ల‌భ‌నేని వంశీ టిడిపి నుంచి చేర‌డంతో ఒక్క‌ట‌య్యారు. వ‌ల్ల‌భ‌నేని వైసీపీలో ఒంట‌రి కాగా, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, దుట్టా రామ‌చంద్ర‌రావు క‌లిసి ఎదురుదాడి ఆరంభించారు. చాలాకాలంగా వీరి మ‌ధ్య వివాదం రాజుకుంటున్న తాజాగా చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వైసీపీలో ర‌చ్చ రేపుతున్నాయి. వల్లభనేని వంశీ, కొడాలి నానికి ఆస్తులు ఎలా వచ్చాయ‌ని వీరు ప్ర‌శ్నించారు. ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారు? అని నిల‌దీశారు. ఎప్పుడూ సినిమాల గురించి కొడాలి నాని చెబుతాడ‌ని, ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంద‌ని, చివ‌ర్లో విల‌న్ కి చెంప దెబ్బ‌లు త‌ప్ప‌వ‌న్నారు. కొడాలినాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌ల్ల నియోజకవర్గానికి ఏమైనా ఉపయోగపడ్డారా అని యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు ప్ర‌శ్నించారు. వల్లభనేని వంశీ ఆగడాలను మేం ప్ర‌శ్నించబట్టే మాకు ప్రజల్లో గుర్తింపు వచ్చింద‌ని, ఎమ్మెల్యేలకి వ‌చ్చిన క్రేజ్ వ‌చ్చింద‌ని  దుట్టా వ్యాఖ్యానించారు. మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావు మాట‌లు సోష‌ల్మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

టీవీ 3*3 త‌న స్వామిభ‌క్తిని చాటుకునేందుకు అతి పెద్ద దుస్సాహసానికి ఒడిగ‌ట్టింది. వైసీపీ స‌ర్కారు ఇప్ప‌టికే అవాస్త‌వాలు, అస‌త్యాలు ప్ర‌చారం చేస్తోంది. రేటింగులోనూ నెంబ‌ర్ వ‌న్ స్థానం నుంచి ప‌డిపోయినా ఫేక్ ప్రాప‌గండా మాన‌డంలేదు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా లైవ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ స‌డెన్గా బ్రేకింగ్ న్యూస్ వేసింది. ``విశాఖ రాజధానికి లైన్ క్లియర్‌, రాజధానిపై నిర్ణయం ప్రభుత్వానిదేనన్న సుప్రీంకోర్టు,  హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే`` అంటూ టీవీ 3*3 సుప్రీంకోర్టు త‌ర‌ఫున తీర్పు ఇచ్చేసింది. ఇది ప‌దేప‌దే ప్ర‌సారం చేసిన ఓ ఐదు నిమిషాల త‌రువాత ఆపేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు మ‌నం ఎలా మిస్స‌య్యాం అని మిగిలిన చాన‌ల్ వాళ్లు ఉరుకు ప‌రుగులు పెట్టారు. అయితే అస‌లు విష‌యం తెలిసి షాక్ తిన్నారు. అటు సీబీఐ తాడేప‌ల్లి కాంపౌండ్ పై దృష్టి పెట్ట‌డం, ఇటు ఎన్ఐఏ కోడిక‌త్తి కేసు, మ‌రో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డికి తాత్కాలిక ఆనందం క‌ల‌గ‌జేసేందుకు ఏకంగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం పేరుతో త‌ప్పుడు తీర్పులు ఇచ్చేసి ప్ర‌సారం చేశారు. వాస్త‌వంగా ఈ రోజు సుప్రీంకోర్టులో రాజ‌ధాని కేసులు విచార‌ణ కోసం లిస్టు కాలేదు. మూడు రాజధానుల కేసుపై ఫిబ్రవరి 7న సుప్రీం కోర్టు విచారించ‌నుంది. అయితే సుప్రీంకోర్టు పేరుతో ఇలా తప్పుడు తీర్పులు వెలువ‌రించ‌డం తీవ్ర‌మైన నేరంగా ప‌రిగ‌ణించాల‌ని న్యాయ‌కోవిదులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున దుమారం రావటంతో, టీవీ 3*3లో, ఆ వార్త తప్పు అంటూ ఖండన ఇచ్చారు.

నిత్య‌మూ ట్విట్ట‌ర్లో బూతులతోనే ప్ర‌తిప‌క్ష టిడిపిపై విరుచుకుప‌డే వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌యసాయిరెడ్డి ప్ర‌వ‌ర్త‌న‌లో ఇటీవ‌ల మార్పు వ‌చ్చింద‌ని ఆయ‌న తీరు స్ప‌ష్టం చేస్తోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ని ప‌ప్పు, ప‌ప్పునాయుడు అంటూ సోష‌ల్మీడియాలో పోస్టులు సాయిరెడ్డి, పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నారా లోకేష్‌కి సోష‌ల్మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. తాజాగా టిడిపి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడి త‌న‌యుడు, హిందూపురం ఎమ్మెల్యే, లోకేష్ మామ అయిన బాల‌కృష్ణ‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. నంద‌మూరి తార‌క‌ర‌త్నని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో  విజయసాయిరెడ్డి ప‌రామ‌ర్శించారు. తారకరత్న ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో  మాట్లాడ్డారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని, ఆస్పత్రి సిబ్బంది మంచి వైద్య సేవలందిస్తోంద‌ని ప్ర‌శంసించారు.  గుండెతోపాటు ఇతర అవయవాలు ప‌నితీరు బాగుంద‌ని, మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతోంద‌ని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాన‌న్నారు. తార‌క‌ర‌త్న‌ వైద్య సేవలను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నార‌ని బాల‌య్య‌ని ఆకాశానికి ఎత్తేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదంతా టిడిపి మీదో, బాల‌య్య మీదో ప్రేమ కాద‌ని.. తార‌క‌ర‌త్న విజ‌యసాయిరెడ్డి మ‌ర‌ద‌లి అల్లుడు కావ‌డంతోనే ప‌రామ‌ర్శ‌కి వ‌చ్చార‌ని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read