అమరావతి రైతులు నిండా మునిగిపోయారు. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒక మంచి రాజధాని, గర్వంగా చెప్పుకునే రాజధాని కోసం, 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, త్యాగాలు అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం మారిపోవటంతో, అమరావతి రైతుల రాత మారిపోయింది. వారు కన్న కలలు అన్నీ ఆవిరి అయిపోయాయి. మొత్తం తారుమారు అయిపొయింది. అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పారు. అమరావతి కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్ మాత్రమే అని చెప్పారు. అంటే, ఇక్కడ కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని జగన్ చెప్పారు. దీంతో గత మూడు రోజులుగా అమరావతి రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. అయితే, ఈ రోజు జీఎన్‌రావు నిపుణుల కమిటీ ఈ రోజు ఇచ్చిన రిపోర్ట్ లో, అమరావతి రైతులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది అని చెప్తే, ఈ జీఎన్‌రావు నిపుణుల కమిటీ అసెంబ్లీ విషయంలో కూడా మెలికలు పెట్టింది.
అమరావతి అసెంబ్లీలో కేవలం వర్షాకాల సమావేశాలు మాత్రమే ఉంటాయని ఈ కమిటీ చెప్పింది. సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్, అసెంబ్లీ విశాఖలో ఉండాలని, హైకోర్ట్ బెంచ్, అసెంబ్లీ భవనం, రాజ్‌భవన్ అమరావతిలో ఉండాలని, హైకోర్టు కర్నూలులో ఉండాలని తమ నివేదికలో సూచించినట్లు జీఎన్‌రావు తెలిపారు. దీంతో అమరావతి రైతులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. ఈ కమిటీ అయినా సరైన న్యాయం చేస్తుంది అనుకుంటే, వీళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారని, అసలు వీళ్ళు అమరావతిలో పర్యటన చెయ్యలేదని, తమ అభిప్రాయాలు కూడా తెలుసుకోలేదని వాపోతున్నారు. అమరావతిలో వరదలు వస్తాయని, పంటలు నష్టం అంటూ, వైసీపీ మాట్లాడిన మాటలే, వీళ్ళు కూడా మాట్లాడుతున్నారని అన్నారు.
కమిటీ ప్రకటన చేసిన వెంటనే రైతులు ఆందోళన బాట పట్టారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రాత్రి పూట కూడా రోడ్డుకు వచ్చి, ఆందోళన చేస్తున్నారు. చొక్కాలు తీసి రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు. సచివాలయం వద్ద ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కట్టిన బ్యానర్లు రైతులు చించివేసారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చెయ్యగా, పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది జీఎన్ రావు కమిటీ కాదని, ఇది జగన్ కమిటీ అంటూ నినాదాలు చేస్తున్నారు. సచివాలయంలో ప్రెస్ మీట్ తరువాత కమిటీ సభ్యులను అడ్డుకునే ప్రయత్నంలో రైతులు ఉన్నారు. అయితే, పోలీసులు వారిని, వేరే మార్గంలో తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.