గోదావరిలో పడవప్రమాదం జరిగి 26మంది చనిపోతే, ఆ దుర్ఘటనపై ప్రభుత్వం కిందిస్థాయి అధికారులు, పోలీసులతో తూతూమంత్రపు ప్రకటనలు చేయిస్తూ, ప్రమాదానికి కారకులైన అసలు దొంగలను కాపాడాలని చూస్తోందని మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తమవారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న పడవ ప్రమాదబాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితోనే వ్యవహరిస్తోందన్నారు. తమవారి మృతదేహాలు అప్పగించాలని కోరుతూ మృతుల కుటుంబాలు కన్నీళ్లతో వేడుకుంటున్నా, అధికారులు మంత్రులు స్పందించకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చినరాజప్ప చెప్పారు. ప్రమాదం జరిగి రెండు వారాలవుతున్నా కూడా ప్రభుత్వం నీళ్లల్లో మునిగిన పడవను బయటకు తీయలేకపోయిందన్న ఆయన అన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి 21మంది చనిపోతే, రెండ్రోజుల్లోనే పడవను వెలికితీసి, మృతుల కుటుంబాలకు రూ.20లక్షల వంతున (ఒక్కో కుటుంబానికి) పరిహారం అందించి న్యాయంచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే మంత్రులుగానీ, ముఖ్యమంత్రి గానీ ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కంటితుడుపు చర్యలతో సరిపెట్టారని నిమ్మకాయల తెలిపారు. పడవ ప్రమాదంపై పర్యాటకశాఖా మంత్రి రోజుకోలా మాట్లాడితే, జలవనరుల శాఖా మంత్రేమో, ప్రమాద ప్రాంతంలో ఒక్కరోజు హడావుడి చేసి కనిపించకుండా పోయాడని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. ప్రమాదానికి గురైన పడవను వెలికితీయడం చేతగాని ప్రభుత్వం, దాన్ని తీసేవారు ఎవరైనాఉంటే ఆ జిల్లా అధికారులను కలవాలని కోరుతూ సోషల్‌మీడియాలో ప్రకటనలివ్వడం రాష్ట్రప్రభుత్వ అసమర్థతకు సంకేతం కాదా అని నిమ్మకాయల ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైనా దుర్ఘటనలు, ప్రమాదాలు, ప్రకృతివిపత్తులు జరిగితే ప్రభుత్వాలపై నిందలు వేసే జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అదేపద్ధతిని కొనసాగించడం ఆయనలోని మానసిక జాడ్యాన్ని సూచిస్తోందన్నారు. గోదావరిలో మునిగిన పడవను తీయడంచేతగాని రాష్ట్రజలవనరుల మంత్రి అనిల్, పోలవరం ప్రాజెక్ట్‌ని అప్పుడు పూర్తిచేస్తాం... ఇప్పుడు పూర్తిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చినరాజప్ప దెప్పిపొడి చారు. పోలవరంలో 75శాతం పనులు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తిచేశాక, ఇప్పుడొచ్చిన వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలమైన సంస్థలకు పనులు అప్పగించడానికి వాటితో చీకటి ఒప్పందాలు చేసుకుంటోందన్నారు. పోలవరం పనుల్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి అనిల్, నవయుగ సంస్థను కాదని, అనుభవం లేని మెగాసంస్థకు ప్రాజెక్ట్ పనులు అప్పగించడం వెనకున్న లోగుట్టుని ప్రజలకు తెలియచేయాలని మాజీహోం మంత్రి సూచించారు.