మధ్యప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, వెంటనే బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌కు కొద్ది రోజుల క్రితం స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు విన్నవించుకున్నారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బీజేపీ ఉందనే వార్తలు ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. తాజాగా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమేననే అనుమానాలు బలపడుతున్నాయి. బీఎస్‌పీకి చెందిన ఎమ్మెల్యే రమాబాయి మీడియాతో మాట్లాడుతూ తనను భారతీయ జనతా పార్టీలోకి రమ్మంటూ ఫోన్ కాల్స్ వచ్చాయని, తనకు మంత్రి పదవి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఇలానే చాలా మందికి బీజేపీ నేతలు ఫోన్ చేసి చెబుతున్నారని, అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరేది లేదని ఆమె స్పష్టం చేశారు.
బీజేపీలోకి కేవలం మూర్ఖులు మాత్రమే వెళ్తారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో బీఎస్‌పీ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే ఇద్దరికీ బీజేపీ నేతలు ఫోన్ చేసి మంత్రి పదవులతో పాటు 50-60 కోట్ల రూపాయల డబ్బు ఆశచూపారని రమాబాయి తెలిపారు. ఇలాగే మిగతా ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక కర్ణాటకలోని జెడిఎస్-సంకీర్ణ ప్రభుత్వానికి సంకట పరిస్థితి ఎదురైంది. తాజా ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..బిజెపి నేత ఎస్‌ఎం కృష్ణను కలవడం చర్చనీయాంశమైంది.. రమేష్ జర్కిహోలి, సుధాకర్‌లు ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత బిఎస్ యడ్డ్యూరప్ప కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ భేటీ రాజకీయ పరమైనదని కాదని, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయానికి అభినందనలు తెలుపడానికి వచ్చామని కాంగ్రెస్ నేత రమేష్ స్పష్టం చేశారు. అదేవిధంగా మాండ్య స్థానం నుండి గెలిచిన స్వతంత్య్ర అభ్యర్థి సుమలత కూడా కృష్ణను ఆయన నివాసంలోనే కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చానని అన్నారు. రాష్ట్రంలో 28లోక్‌సభ స్థానాల్లో బిజెపి 25 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన మూడు స్థానాలు కాంగ్రెస్, జెడిఎస్, స్వతంత్య్ర అభ్యర్థి చెరో ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి..