తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పుట్టిన రోజు నేడు(28 మే 2019). ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి.. ఘాట్‌లో ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క బ్యానర్ కూడా కట్టకపోవడం దురదృష్టమని అన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌ను టీడీపీ కార్యకర్తలు పవిత్ర ప్రదేశంగా భావించాలని.. దీనిని అలంకరించవలసిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు.
చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రల వల్ల తగిన శాస్తి జరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ జగన్ సరిదిద్దుతారనే నమ్మకం ఉందన్నారు. అయితే చంద్రబాబుని పదే పదే తిడుతూ, కావాలని అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేసారు. అక్కడే ఉన్న తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘాట్ వద్ద రాజకీయాలు మాట్లాడవద్దని లక్ష్మీపార్వతి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ... చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ ఘాట్, తెలంగాణా ప్రభుత్వం ఆధీనంలో ఉందని, ఎప్పుడూ జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసేదని, మేము ఏర్పాట్లు చెయ్యటం లేదు అని, మాకు ముందు చెప్తే మేమే ఏర్పాట్లు చేసే వాళ్ళం కదా అని తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.