బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో కొత్త ప్రభుత్వం జల వనరుల శాఖను ఎవరికి అప్పగిస్తుందనే విషయంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. నిన్న పోలవరం పై జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో పోలవరం పై ఇన్నాళ్ళు ఎంతో ఆవేదన చెందిన ఉండవల్లిని, ప్రభుత్వ సలహాదారుగా ఉండమని ప్రభుత్వం నుంచి అడగవచ్చని తెలుస్తోంది. దీనికి తోడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా వైఎస్ ప్రభుత్వంలో అనుమతుల దగ్గర నుంచి సర్వం తెలిసిన ఉండవల్లి కాబట్టి కనీసం ఈ ప్రాజెక్టు గురించి కూడా చాలా కీలకంగా భావించి ఆయన సహకారాన్ని కోరవచ్చని తెలుస్తోంది. వైఎస్‌కు అప్పట్లో కేవీపీ ఆత్మగా ఉంటే, ప్రస్తుత ప్రభుత్వ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని వైఎస్‌కు అత్యంత సన్నిహితుడుతైన ఉండవల్లి అరుణ్‌కుమార్ సేవలు వైఎస్ కుమారుడు జగన్ పొందవచ్చని సమాచారం. తండ్రికి కేవీపీ అయితే, తనయుడికి ఉండవల్లి అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు 70.17 శాతం పూర్తయింది. కొత్త ప్రభుత్వం కొలువు దీరే సమయం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ఎంత వేగంగా జరుగుతాయో అనేది చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, అమరావతి విషయంలో ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఆసక్తి రేకెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సుకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 62.65 శాతం పూర్తయింది. మెయిన్ డ్యామ్‌కు సంబంధించి 62.73 శాతం పనులు పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వం డిసెంబర్ నాటికి గ్రావిటీపై నీరిస్తామని చెప్పింది. అయితే గత సంవత్సర కాలంగా కేంద్రం సహకరించక పోవటం, గత మూడు నెలలుగా, కీలకమైన సమయంలో పణులు మందగించటంతో, అంచనా తప్పింది.
స్పిల్ వే, స్పిల్ వే ఛానల్, అప్రోచ్ ఛానల్ మట్టి పనులు గత ప్రభుత్వ హయాంలో 85.50 శాతం, స్పిల్ వేలు, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ క్రేవిసెస్ 74.80 శాతం, రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ 69.14 శాతం పనులు జరిగాయి. ఎగువ కాఫర్ డ్యామ్ 51.50 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ 29.96 శాతం పనులు జరిగాయి. ఎడమ కనెక్టవిటీల్లో 48.57 శాతం, కుడి కనెక్టవిటీల్లో 76.58 శాతం పనులు జరిగాయి. కుడి ప్రధాన కాల్వ పనులు 91.14 శాతం, ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి 70.99 శాతం పనులు జరిగాయి. అయితే ప్రస్తుతం ప్రధానంగా కాఫర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తవుతున్న క్రమంలో ముంపు గ్రామాలకు సంబంధించి పునరావాసం ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. నిర్వాసితులకు నాణ్యమైన ఇళ్లను నిర్మించడంతోపాటు చట్ట హక్కుల ప్రకారం పునరావాసాన్ని పూర్తిస్థాయిలో కల్పించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ, ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ఆందోళన చెందిన ఉండవల్లి, కేవీపీలకు, తమకు అనుకూలమైన జగన్ ప్రభుత్వం రావటంతో, వీళ్ళే దగ్గరుండి, పనులు పూర్తి చేసి, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే, కావాల్సింది ఏముంది.