ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని, పని చెయ్యకుండా చెయ్యటం అనేది ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసామా ? కాంగ్రెస్ పార్టీ గవర్నర్లని అడ్డు పెట్టుకుని, రాష్ట్రాలని ఇబ్బంది పెట్టిన చరిత్ర చూసాం. ఇప్పుడు మోడీ, దీన్ని మరి కాస్త ముందుకు తీసుకువెళ్ళి, నిబంధనల పేరుతొ ఏకంగా చీఫ్ సెక్రటరీ చేత, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి ప్రతి ఫలింగా అన్నట్టు, దేశంలో ఎప్పుడూ లేని విధంగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నన్ను పని చేసుకోనివ్వండి, మా ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి అంటూ, లేఖలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పే సందర్భం ఇది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఏపీ విషయంలో ఈసీ తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షమని, ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఈసీఐకి 9 పేజీల లేఖ రాశారు. సీఎం భద్రత చూస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ బదిలీలు ఏకపక్షమని ఆరోపించారు. వైకాపా చేసిన ఫిర్యాదులపై విచారణ లేకుండానే బదిలీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బదిలీలు, ఏకపక్ష నిర్ణయాలపై స్వయంగా ఈసీఐకి తెలియజేశామని లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని అన్నారు. దీంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారని, మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని లేఖలో పేర్కొన్నారు.
‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికలప్పుడు ఇలాంటి ఘటనలు చూడలేదు. తెదేపా చేసిన ఏ ఫిర్యాదుపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. కానీ, వైకాపా చేసిన ఫిర్యాదులపై వెంటవెంటనే నిర్ణయాలు అమలయ్యాయి. ఫిర్యాదులు చేసిన తెదేపా నేతలను ఐటీ దాడులతో భయపెట్టారు. ఆధారాలు లేని కేసులతో వారిని ఇబ్బందులు పెట్టారు’ అని చంద్రబాబు అరోపించారు. సాధారణ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ప్రజలకు సంబంధించిన కీలక అంశాల్లో వ్యాఖ్యలు చేయడం సీఈవోకు తగదని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తాగునీరు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నానని, సమీక్షలు నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడుతోందని తెలిపారు. సీఎంకు అధికార పరిధిలేదంటూ సీఈవో మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. నివేదికలను అదనపు డీజీ నేరుగా సీఎంకు నివేదించవద్దంటూ ఆదేశించడం తగదని చంద్రబాబు అన్నారు.