పోలింగ్ జరిగిపోయింది. ఓట్లన్నీ పెట్టెల్లో దాగి ఉన్నాయి. అయితే అభ్యర్థులు మాత్రం టెన్షన్ ..టెన్షన్‌గా గడుపుతున్నారు. కౌంటింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ వారిలో టెన్షన్ మరింత పెరుగుతోంది. అయితే పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు మీద ఎవరి లెక్కలు వారు వేసుకుని ఆశల పల్లకిలో ఉన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలైన నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురంలలోని 231 పోలింగు కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీన 1,67,915 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ఓటర్ల సహనాన్ని పరీక్షించినా గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 0.98 అధిక శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళా ఓటర్లు 85,269 మంది కాగా పురుష ఓటర్లు 82,646 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి మండలంలోను మహిళా ఓటర్లదేపై చేయిగా ఉంది.
ఇక ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు గెలుపు మీద ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో పోలింగు సరళి మీద సీఎం చంద్రబాబు చేపడుతున్న సమీక్షలో కూడా దాదాపు ఆరు వేలు ఆధిక్యంతో తమ పార్టీ గెలుపు సాధిస్తుందని అభ్యర్థి గాలి భానుప్రకాష్ ప్రతి బూత్‌లో అంచనాను తయారు చేసుకున్నారు. వడమాలపేట మండలంలో ప్రతిసారి ప్రత్యర్థి పార్టీకి ఆధిక్యం వస్తుందని అయితే ఈ సారి ఆ అంచనా తలకిందులయ్యే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. పుత్తూరు, నగరి మున్సిపల్ పరిధిలో కూడా ఆధిక్యం వస్తుందని చివరకు నిండ్ర, విజయపురం మండలాల్లో కూడా స్వల్ప ఆధిక్యంతో గెలుపు సాధిస్తామని అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రత్యర్థి పార్టీ అంచనాలు వేస్తోంది.
యథా ప్రకారం వడమాలపేట మండలంలో తమకు ఆధిక్యత వస్తుందని అంచనా వేస్తూ లెక్కింపు ప్రారంభమే ఆధిక్యంతో ప్రారంభిస్తామని భావిస్తున్నారు. పుత్తూరు, నగరి రూరల్ పరిధిలో వచ్చే అధిక ఆధిక్యంతోనే దూసుకుపోతూ నిండ్ర, విజయపురం మండలాల్లో స్వల్ప ఆధిక్యంతో దాదాపు ఆరువేలతో గెలుపు సాధిస్తామని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన సంక్షేమ పథకాలను చివరిలో ఇరు పార్టీలు ఇచ్చిన తాంబులాన్ని తీసుకున్న ఓటరు మాత్రం గుంభనంగా చోద్యం చూస్తున్నారు. తాంబులాలు ఇచ్చాం తన్నుకు చావండని నింపాదిగా ఓటరు లోలోన ఆనందిస్తున్నారు. ఇకపోతే ఈవీఎంలలో ఓట్లు భద్రంగా ఉన్నా నాయకులకు మాత్రం అభద్రతా భావంతో తమ ప్రతినిధులను స్ట్రాంగ్ రూంల వద్ద అదనపు కాపలా దారులుగా నియమించుకున్నారు.