ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరిస్తున్నారో లేదో తనకు అనవసరమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ తనకిచ్చిన పుస్తకాల్లో ఉన్న నిబంధనలే అనుసరిస్తున్నానని..ఎక్కడా వ్యక్తిగత ఎజెండాతో తాను నడుచుకోవడంలేదని స్పష్టం చేశారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ద్వివేది ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు సీఈసీకి రాసిన లేఖపై ‘నో కామెంట్’ అని వ్యాఖ్యానించారు. దానిపై కమిషన్ నుంచి వచ్చే స్పందనను అనుసరించి తాను వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన పుస్తకాలను పార్టీలు, అధికారులందరికీ ఇచ్చామని.. ఆ పుస్తకాల్లో ఏది ఉంటే అదే తాను అనుసరిస్తున్నానని తెలిపారు.
‘కలెక్టర్లు, ఎస్పీలు నేను చెప్పినా వింటారు. సీఎస్, డీజీపీలు కూడా చెప్పడంవల్ల మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారు. గతంలో సీఎస్‌గా పునేఠా ఉన్నప్పుడు కూడా ఎన్నికలపై 3సార్లు సమీక్షలు చేశారు’ అని తెలిపారు. పోలింగ్‌కు.. కౌంటింగ్‌కు మధ్య వ్యవధి ఎక్కువగా ఉండడమే అపోహలకు, అనుమానాలకు కారణమవుతోందని ఈసీ వర్గాలు అంటున్నాయి. గతంలో ఎప్పుడూ ఎన్నికల నిర్వహణపై ఇంత పెద్దఎత్తున అనుమానాలు, అపోహలు ప్రజల్లోను, రాజకీయవర్గాల్లోను చూడలేదని ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు అంటున్నారు. ఈ సారి ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరగడం, పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య నెలన్నర వ్యవధి ఉండడంతోనే అనుమానాలు రేకెత్తుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
పాలనకు ఆటంకం కలుగుతోందని, ప్రజలకు అత్యవసరమైనవీ కోడ్ వల్ల ప్రభుత్వం అందించలేకపోతుందనే వాదన ప్రభుత్వం, ప్రజల నుంచీ వాదనలు వినపడుతున్నాయి. దేశంలో ఎన్నికలు ముగిసిన ఇతర రాష్ట్రాల్లో కూడా పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య వ్యవధి అధికంగా ఉండడంతో, పాలనకు ఎన్నికల కోడ్ శాపంగా మారిందని ఆయా రాష్ట్రాలు ఆవేదనతో ఉన్నాయని అంటున్నారు. పోలింగ్ ముగిసి పోయినందున కోడ్ నిబంధనలను సడలించాలని సీఈసీని కోరే అవకాశం లేకపోలేదు. ‘పోలింగ్ అయిపోయాక ఓటర్లను ప్రభావితం చేసేది ఏం ఉంటుంది? సీఈసీ సవరించాలనుకుంటే నిబంధనలు సడలించవచ్చు’ అని ఓ ఉన్నతాధికారి వ్యక్తిగతంగా అభిప్రాయపడ్డారు.