వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు వ్యవహారం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన, 21 పార్టీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. 50 శాతం స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటూ పార్టీలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పార్టీలు.. 50 శాతం తప్పనిసరిగా లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి.

cbn supremecourt 24042019

మరో పక్క వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి మంగళవారం ముంబైలో చంద్రబాబు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా ఎన్నికల్లో రష్యన్‌ హ్యాకర్లు పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు అమెరికా ప్రస్తావన తీసుకురాకుండానే, రష్యన్‌ హ్యాకర్ల పాత్ర గురించి వ్యాఖ్యానించారు. ‘ఈవీఎం యంత్రాలను హ్యాక్‌ చేయడంలో రష్యన్‌ హ్యాకర్ల పాత్రకు అవకాశం ఉంది. కోట్లు ఖర్చు చేస్తే హ్యాక్‌ చేయగలమని కొన్ని బృందాలు తిరుగుతున్నాయి. అందుకే ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి. ప్రోగ్రామింగ్‌ ద్వారా ఈవీఎంలు యంత్రాలు పనిచేస్తాయి. ఆ ప్రోగ్రామింగ్‌ మారిస్తే వాటిలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్‌ చెబుతున్న దాని ప్రకారం ఈవీఎంయంత్రాలకు అనుబంధంగా ఉన్న వీవీ ప్యాట్లలో ఓటరు ఎవరికి ఓటు వేసిందీ, ఆ గుర్తు ఏడు సెకండ్లు కనిపించాలి. కానీ కొన్ని చోట్ల మూడు సెకండ్లే కనిపించింది. ట్విటర్‌లో నిర్వహించిన ఒక పోల్‌లో 27 శాతం మంది ఏడు సెకండ్లు కనిపించిందని చెబితే, 55 శాతం మంది మూడు సెకండ్లే కనిపించిందని చెప్పారు. ప్రోగ్రామింగ్‌ మారిస్తే మాత్రమే ఇలా సమయం తగ్గుతుంది. ఎవరు మార్చారు... ఎందుకు మార్చారన్నది తేలాలి’’ అని ఆయన అన్నారు.

cbn supremecourt 24042019

కొన్ని యంత్రాల్లో మూడు సెకండ్లు కనిపించడం, కొన్ని యంత్రాల్లో ఏడు సెకండ్లు కనిపించడంపై తీసిన వీడియోలను ఆయన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ‘‘ఏడు రాష్ట్రాలకు చెందిన ఈవీఎం యంత్రాలను పోయిన డిసెంబర్‌లో వార్షిక నిర్వహణ పేరుతో కొన్ని కంపెనీలకు ఇచ్చారు. ఆ సమయంలో ఏం జరిగిందన్నది రహస్యంగా మిగిలిపోయింది. ఏమయి ఉంటుందనేది ఎవరికీ తెలియదు. పార్లమెంటుకు కూడా తెలపలేదు. కొందరు సర్వీస్‌ ఇంజనీర్ల ద్వారా వాటిని మరమ్మతు చేయించామని చెబుతున్నారు. ఆ ఇంజనీర్లు ఎవరు... వారిని ఎవరు నియమించుకొన్నారు... వారిపై పర్యవేక్షణ ఎవరిది? ఏ అక్రమాలు జరగకుండా సెక్యూరిటీ ఆడిట్‌ ఎవరు చేశారన్న దానికి ఎవరి వద్దా సమాధానాలు లేవు. అందుకే ఈవీఎం యంత్రాలపై మాకు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నాం. ఇవాళ కాకపోతే రేపైనా ఈ దేశం బ్యాలెట్‌ ఓటింగుకు మళ్లాల్సిందే. మన కంటే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కలిగిన దేశాలే పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు జరుపుతుంటే అనేక అనుమానాలతో మనం ఈవీఎం యంత్రాలను వినియోగించాల్సిన అవసరం లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు. ఈ దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరు రాజకీయ నాయకుల కంటే బాగా ఎక్కువ ప్రోత్సహించిన వాడిని తానేనని, తానే ఈ విషయంలో సాంకేతికత వద్దని చెబుతున్నానంటే పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి.. సీబీఐ మాజీ జేడీ, జనసేన ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీ నారాయణకు మధ్య గత వారం రోజులుగా ట్వీట్ వార్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ల పై ఒక ఇంటర్వ్యూ లో లక్ష్మీనారాయణ దీని పై మరింత క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు ఆహ్వానం వచ్చిందని సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. వైసీపీ లో చేరాలని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి తనను స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..‘నాకు విజయసాయిరెడ్డి ఫోన్ చేసి అది(జగన్ అరెస్ట్) మీరు వృత్తిపరంగా చేశారు.

vv 24042019

రాజకీయాలు వేరే. మేం కూడా ప్రజల కోసం మంచి పనులు చేయాలనుకుంటున్నాం. అందుకే జగన్ పాదయాత్ర కూడా చేశారు. కాబట్టి గతంలో జరిగింది పక్కన పెట్టేసి మీరు కూడా ప్రజల కోసం ఇందులో భాగస్వామి అయితే బాగుంటుందని చెప్పారు’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో వేర్వేరు పార్టీల నుంచి ఆహ్వానం రావడం అన్నది సాధారణమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక రకరకాల ఆలోచనలతో ఉన్న పార్టీలు సంప్రదిస్తాయనీ, కానీ తన ఆలోచనతో ఉన్నవారితోనే కలిసి పనిచేస్తానని గతంలోనే స్పష్టం చేశానని గుర్తుచేశారు.

vv 24042019

పోయిన శనివారం విజయసాయిరెడ్డి ట్వీట్లకు లక్ష్మీనారాయణ ఘాటుగా సమాధానమిచ్చారు. జనసేన 65 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టిందని విజయసాయిరెడ్డి శుక్రవారం ట్వీట్‌ చేయడంతో తాము 140 స్థానాల్లో పోటీకి దిగామని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. దీనికి స్పందనగా మళ్లీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తూ చంద్రబాబుకు ఇచ్చిన బీఫారాలు పోనూ జనసేన 65 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిందని, 80 సీట్లలో డమ్మీలే ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై లక్ష్మీనారాయణ స్పందిస్తూ... విజయసాయిరెడ్డికి హైదరాబాద్‌, దిల్లీ ట్యూషన్లు సరిగా పని చేయడం లేదని, ట్యూషన్‌ మాస్టార్లు కోప్పడతారని, ఒకసారి లెక్కలు సరి చూసుకోవాలని హితవు పలికారు.

ఎన్నికలు ముగిసాయి... ఫలితాలకు 43 రోజుల సమయం ఉంది... ఈ గ్యాప్ లోనే చంద్రబాబుని టార్గెట్ చెయ్యగలం, తరువాత ఎలాగూ చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా తాట తీస్తాడు అని తెలిసిన, ఢిల్లీ పెద్దలు, సరిహద్దుల దొరలు, ఆంధ్రా ద్రోహులు, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ఎత్తు వేసారు. ఇది ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయం కాబట్టి, ఎన్నికల కమిషన్‌ ని అడ్డు పెట్టుకుని ఏపి పై తుపాకీ పెల్చుతున్నారు. ఇప్పటకే తమకు అనుకూలమైన చీఫ్ సెక్రటరీని పెట్టుకుని, ఎన్ని ఆటలు ఆడుతున్నారో చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా, ఓట్ల లెక్కింపు వంటి అంశాలను కూడా చీఫ్ సెక్రటరీకి అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రక్రియతో ఏమాత్రం సంబంధంలేని, అసలు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకునే అవసరం/అధికారమే లేని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు ఎందుకు ఇలా చెయ్యమని చెప్పారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

lv 24042019

ఈసీ ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఈ ఆదేశాలు జారీ చేసారు. ‘ఓట్ల లెక్కింపుపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. దీనికి మీరంతా హాజరు కావాలి’ అని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది రిటర్నింగ్‌ అధికారులుగా ఉన్న జిల్లా కలెక్టర్లు, అధికారులతోపాటు ఎస్పీలకు ఉత్తర్వులు పంపించారు. ఈ ఉత్తర్వులు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే రాష్ట్ర పరిపాలనాధికారి! రాష్ట్రంలో అత్యున్నత అధికారి ఆయనే. అదంతా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేదాకానే! ఒక్కసారి కోడ్‌ అమలులోకి వచ్చిందంటే... కలెక్టర్లందరూ రిటర్నింగ్‌ అధికారులవుతారు. ఎస్పీలు, పోలింగ్‌తో ప్రత్యక్ష సంబంధముండే అధికారులు, సిబ్బంది మొత్తం నేరుగా సీఈవో పర్యవేక్షణలోకి వెళతారు.

lv 24042019

వారిపై సీఎస్‌ ఎలాంటి ఆజమాయిషీ చేయజాలరు. ఎలాంటి సమీక్షలు నిర్వహించాలన్నా సీఈవోకు అధికారం ఉంటుంది. ఎందుకంటే సీఈవోను నేరుగా ఈసీ నియమిస్తుంది. సీఈవో ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో.. సీఎం పరిధిలో కూడా ఉండరు. ఒక స్వతంత్ర వ్యవస్థలా పనిచేస్తారు. స్వతంత్య్ర వ్యవస్థ కిందే ఎన్నికల సంబంధిత పనులు, సమీక్షలు, కౌంటింగ్‌, భద్రత ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షలు జరుగుతాయి. సీఎస్‌కు ఈ సమీక్షలతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే.. సీఎ్‌సకు ఎన్నికల నిర్వహణతో సంబంధమే ఉండదు. ఈ నేపథ్యంలో.. వచ్చేనెల 23న ఓట్ల లెక్కింపుపై ఎలాంటి సమీక్ష సమావేశమైనా సీఈవోనే నిర్వహించాలి. అది ఆయన అధికారం. అలాంటి.. కౌంటింగ్‌పై బుధవారం సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం సమీక్ష పెట్టాలనుకోవడం ఒక వింత! ‘సీఎస్‌ నిర్వహించే సమీక్షలో పాల్గొనండి’ అని సీఈవో కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులను ఆదేశించడం మరో వింత!

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు . పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలకు పాల్పడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. విద్యార్థుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు . ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరీక్షల కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు . పరీక్షల్లో పాస్ కానంత మాత్రాన ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులను ఆశలను తుంచేయవద్దని విద్యార్థులకు సూచించారు.పరీక్షల్లో గెలవడమే జీవితం కాదని చెప్పిన బాబు పరీక్షలు కేవలం ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని పేర్కొన్నారు. తమపైనే ఆశలు పెట్టుకుని బతుకుతున్న తల్లిదండ్రులను కడుపుకోతకు గురిచేయవద్దని విద్యార్థులను కోరారు చంద్రబాబు .

cbn reaction 24042019

‘పరీక్షల్లో తప్పామని తెలంగాణలో 16 మంది ఇంటరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణం నన్ను కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ‘విద్యార్థులకు నా విజ్ఞప్తి ఒక్కటే. పరీక్షల్లో పాస్‌ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే. పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. ప్రాణాలు అంతకంటే అమూల్యం’ అని పేర్కొన్నారు.

cbn reaction 24042019

‘దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. యువతరం దేశానికి తరగని సంపద. పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితాలను అర్ధాంతరంగా ముగించకండి. మీపై పెట్టుకున్న కన్నవారి ఆశలను కడతేర్చి వారికి కడుపుకోత మిగల్చకండి’ అని సూచించారు. ‘మీ ముందు బంగారు భవిష్యత్తుంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే. ఓటమి విజయానికి తొలిమెట్టు’ అని పేర్కొన్నారు. ‘మంచి ఫలితాల కోసం మళ్లీ కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాల్లో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే. బంగారు భవిష్యత్తూ మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి మీరిచ్చే గొప్ప బహుమతి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read