ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయం పై రోజు రోజుకీ టెన్షన్ పెరిగి పోతుంది. ఎవరి ధీమా వారు చెప్తున్నారు. అయితే మే 19 వరకు సర్వే ఫలితాలు ప్రకటించకూడదు అనే నిభందనలు ఉండటంతో, సర్వేలు కూడా బయటకు రాని పరిస్థితి. అయితే, ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి, తెలంగాణాలో ఫెయిల్ అయినా, ఆయన పై అంచనాలు మాత్రం తగ్గ లేదు. ఒక్క లాగడపాటే కాదు, తెలంగాణా విషయంలో అందరి అంచనాలు తప్పాయి. అయితే ఈసారి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో అనే విషయం పై నోరు విప్పారు. డైరెక్ట్ గా చెప్పకుండా, ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబుతానంటున్నారు.
అయితే, ఆయన వ్యాఖ్యల ద్వారా ఓ విషయంలో స్పష్టత వచ్చింది. అమెరికాలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న లగడపాటి సర్వే వివరాలను మే 19న చెబుతానని స్పష్టం చేసారు. అదే సమయంలో ఏపి ప్రజలు సంక్షేమం..అభివృద్దికి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం తిరుమలలో సైతం లగడపాటి ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా అధికార పార్టీకే అనుకూలంగా ఆయన చెబుతున్నారనే వాదన మొదలైంది. ఇక, పోలింగ్ ముగిసన సమయం నుండి అనేక మంది టిడిపి నేతలు తమ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళి.. విజయావకాశాలు ఉన్నాయో తెలుసుకొనే ప్రయత్నం చేసారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఉదయానికి..సాయంత్రానికి టిడిపి వ్యూహాల్లో మార్పు కనిపించింది.
ఉదయం ఇవియంల నిర్వహణ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసహనంతో కనిపించిన టిడిపి అధినాయకత్వం మధ్నాహ్నం సమయానికి వ్యూహం మార్చింది. ప్రజలంతా పోలింగ్ బూత్‌లకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకించి మహిళలు పోలింగ్ బూత్‌లకు వచ్చేలా ప్రయత్నాలు చేసారు. ఇక, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనటం ద్వారా తమకు మేలు జరుగుతుందని టిడిపి నేతలు అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో లగడపాటి సైతం పోస్ట్ పోల్ సర్వేల ఫలితాలపై టిడిపి ముఖ్యులు ఆరా తీయగా..టిడిపికి అనుకూలంగా ఉన్నాయని చెప్పాయని..ఆయనతో పాటుగా మరి కొన్ని సర్వే సంస్థలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసాయని చెబుతున్నారు. వారి లెక్కల ఆధారంగా టిడిపి నేతలు తాము తిరిగి అధికారంలోకి రావటం ఖాయమనే ధీమాలో ఉన్నారు. వచ్చే నెల 19న ఏపీ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తన సర్వే ఎందుకు లెక్క తప్పిందో కూడా ఆరోజే చెబుతానని స్పష్టం చేశారు.