ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో.. కడప జిల్లాలో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. సెంటిమెంటు పనిచేయకపోవడంతో పాటు కంచుకోటకు బీటలు వారుతున్నాయన్న సంకేతాలతో నేతల కొనుగోళ్లకు ఒక ప్రధాన పార్టీ రంగంలోకి దిగింది. ఓటర్లను ప్రభావితం చేయగల నేతలను ఎంపిక చేసి ‘రేటు’ నిర్ణయిస్తోంది. అడ్వాన్సు ఎరచూపి.. ఆ పార్టీ కండువాలు వేసేస్తోంది. ఇలా పది రోజుల్లోనే దాదాపు రూ.200 కోట్లు ఆ పార్టీ ఖర్చు పెట్టినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ మారిన నేత ఒకరు తన నియోజకవర్గంలో ఇప్పటికే రూ.70 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ నియోజకవర్గ నేతల్లో చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో కడప జిల్లాలో గట్టి పట్టుసాధించిన ఆ పార్టీకి ఇప్పుడు ఆందోళన మొదలైంది. అధికార టీడీపీ బలం పుంజుకుని గట్టి పోటీ ఇస్తుండటంతో నేతల్లో భయం మొదలైంది.
దీంతో టీడీపీలో ఉన్న నేతలకు వల వేసి ఆకర్షించే కార్యక్రమాలు పదిరోజులుగా మొదలయ్యాయి. గ్రామ, మండల, వార్డు స్థాయుల్లో ఉన్న నేతలు ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తారో నిర్ధారించుకుని.. వారి స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.కోటి వరకు ధర నిర్ణయిస్తున్నారు. ముందుగా అడ్వాన్సు కింద కొంత చెల్లించి పార్టీలో చేరినట్లు కండువాలు వేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి రూ.150 కోట్లు ఈ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ముందుకు రావడంతో టికెట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ అభ్యర్థి గతంలో తనతో పాటు ఉన్న పనిచేసిన నేతలతో చర్చలు జరిపి.. ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేస్తారో లెక్కించి రూ.50 వేల నుంచి రూ.లక్ష, 2 లక్షలు, 10 లక్షలు, కోటి వరకు కూడా పంపిణీ చేసినట్లు ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ఇలా ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ నేతలు సయోధ్యతో నడుస్తుండగా.. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని గ్రామ, మండల స్థాయిల్లో ఉన్న నేతలతో బేరాలకు దిగారని సమాచారం. ‘మీరు వస్తే ఇదిగో నగదు..’ అంటూ ఆశ చూపుతున్నారని తెలుస్తోంది. రాయచోటిలో సైతం పదిహేను రోజుల నుంచి ఈ ఆకర్ష పథకం మొదలై లక్షల తో నేతలను కొనుగోలు చేస్తున్నారు. బద్వేలు, మైదుకూరు, కమలాపురం, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఇదే తరహా ప్రలోభాలు, ఆకర్షణలు కొనసాగుతున్నాయి. పులివెందులలో ఓటర్లకు చి వరిలో నోటు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2రోజులుగా కడప, ప్రొద్దుటూరులలో ఇదే పంథాతో ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.