పసుపు- కుంకుమ డబ్బులు ఆపాలని వైకాపా నేతలు హైకోర్టులో పిటిషన్లు వేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకిచ్చే పసుపు-కుంకుమ ఎవరైనా అడ్డుకుంటారా అని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే డబ్బులు ఆగకూడదు గానీ రాష్ట్రం ఇచ్చే డబ్బులు ఎందుకు ఆపాలని ప్రశ్నించారు. అద్దె మైకులు, వలస పక్షులు వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలు కాగానే అందరూ హైదరాబాద్ చెక్కేస్తారని అన్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ బెదిరింపుల వల్లే సినీనటులు జగన్ వద్దకు క్యూ కడుతున్నారని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకోవడం కోసమే వైకాపా కండువాలు కప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వైకాపా మొసళ్లు తెగ కన్నీరు కారుస్తున్నాయని, ఒక్కసారే కదా అని తినే తిండిలో విషం కలుపుకోం కదా!.. కొండపైకెక్కి లోయలో దూకం కదా! అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీతోనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పులివెందులలో తన పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. జమ్మలమడుగు, చిత్తూరు, అన్నిచోట్లా తెదేపాపై సానుకూలత వ్యక్తమవుతోందని, ప్రజల నుంచి అసాధారణమైన స్పందన వస్తోందన్నారు. వాళ్లందరికీ తెలుగుదేశం శ్రేణులు నాయకత్వం అందించాలని సూచించారు. వైకాపాపై ప్రతి చోటా తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడానికి మోదీకి చేతులు రాలేదు గానీ.. ఏపీని, తెదేపాను నిందించడానికి పెద్ద నోరు వచ్చిందని విమర్శించారు. నరేంద్రమోదీ నిందలతో అందరిలో రోషం రావాలని, పట్టుదల పెరిగి పౌరుషంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలన్న కేసీఆర్‌తో కలిసి ఏపీకి జగన్ హోదా తెస్తాడా? అని ప్రశ్నించారు. పోలవరంపై పదేపదే కేసులేసే కేసీఆర్‌కు జగన్ మద్దతు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. సాగర్, శ్రీశైలం తమకే ఇవ్వాలన్న అలాంటి వ్యక్తితో కుమ్మక్కవ్వడమేంటని నిలదీశారు. కేసుల కోసం మోదీతో, ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు. దేశంలో అన్ని ముస్లిం సంఘాలు తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నాయని, మోదీపై ఆయన దత్తపుత్రుడు జగన్ పై వారిలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.