వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. పూతలపట్టు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సునీల్ కొనసాగుతున్నారు. అయితే... ఈసారి ఆయనకు సీటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌కు వచ్చారు. దాదాపు రెండు గంటలపాటు జగన్ నివాసం వద్దే ఉన్నా ఆయనను లోపలికి అనుమతించలేదు. కాగా... అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ నివాసం వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సునీల్ ఎదురుపడినప్పటికీ రామచంద్రారెడ్డి ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు. రామచంద్రారెడ్డి కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారయని సమాచారం.
ఇది ఇలా ఉంటే, మరో వారంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్న నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి రాజకీయ నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నుంచి వైసీపీ వైపు చూస్తున్నవారికంటే.. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారు. మదనపల్లి వైసీపీ టిక్కెట్ మైనారిటీ నేతకు ఖరారు చేశారని ప్రచారం జరుగుతుండడంతో.. ఆయన మంగళవారం తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు.
ఇక ఇటీవల వైసీపీని వీడిన వంగవీటి రాధా బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. నిన్న రాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి చంద్రబాబును కలిసిన వంగవీటి రాధా టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు గంటన్నరపాటు రాధా సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీపై నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన చంద్రబాబుకు చెప్పినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.