దేశ రాజధాని న్యూఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు దీక్ష హీట్ తగిలి, దానికి కవర్ అప్ ఇస్తూ, అమిత్ షా ఒక తప్పుడు లేఖ రాసారు. విభజన హామీల పై మాట్లాడకుండా, చంద్రబాబు పై రాజకీయ విమర్శలు ఆ లేఖలో రాసారు. ఈ సందర్భంగా అమిత్ షా ఏపీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు లేఖ రాశారన్నారు. అమిత్ షా మళ్లీ అసత్యాలు చెబుతున్నారన్నారు. హామీలు నెరవేర్చని ప్రధానికి ఎందుకు స్వాగతం పలుకుతామని ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేశారు కాబట్టే మీపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం, అమిత్ షా, మోడీలకు లేదన్నారు. రాఫెల్ కుంభకోణంపై సమాధానం లేదని చెప్పారు. వాస్తవాలు చెబుతున్న మీడియాపై పగబడుతున్నారన్నారు. శ్రీకాకుళం వెళ్తే అమిత్ షాకు ఖాళీ కుర్చీలు స్వాగతం పలికాయన్నారు.

shah 12202019

ఇవి చంద్రబాబు మాటలు ‘అమిత్‌షా దుర్మార్గమైన లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు స్వాగతం పలకలేదని ఆయన ఆవేదనకు గురవుతున్నారు. హామీలను అమలుచేయని ప్రధానికి ఎలా స్వాగతం పలుకుతారు? కక్షసాధింపు ప్రదర్శిస్తూ గౌరవం కోరుకుంటారా? మోదీ, అమిత్‌షా పచ్చి అబద్ధాలకోరులు. నేను యూటర్న్‌ తీసుకున్నానని అంటున్నారు. కాంగ్రెస్‌వాళ్లు చట్టంలో హోదా అంశం ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. ఆరోజు హోదా కోసం డిమాండ్‌ చేసిన మీ పార్టీవాళ్లు నాడే ఎందుకు ఆ డిమాండ్‌ చేయలేదో అమిత్‌షా చెప్పాలి. నాడు రెండు పార్టీలు కలిసి బిల్లు ఆమోదించే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అదే విషయాన్ని మన్మోహన్‌సింగ్‌ ఎన్నో వేదికలపై చెప్పారు. ఏపీలో ఏడు మండలాలను వారే కలిపామని చెప్పడం పచ్చి అబద్ధం. అదిచేస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని డిమాండ్‌ చేస్తే కలిపారు.

shah 12202019

'ధర్మపోరాట దీక్షకు జాతీయ స్థాయిలో కవరేజీ రాకుండా జాతీయ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. బోఫోర్స్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసినప్పుడు సంతోషించిన నాయకులు ఇప్పుడు వారికి వ్యతిరేకంగా రాస్తే బాధపడిపోతున్నారు. ఏపీ నుంచి కేంద్రానికి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి. మేం ఇచ్చినదానికంటే మీనుంచి వచ్చింది తక్కువే. మీరు దాడిచేస్తే మేంకూడా దాడిచేస్తాం. ఎంతవరకైనా పోతాం. ఇప్పటికైనా పశ్చాత్తాపపడి సరిదిద్దుకోవాలి. మోదీ, షా చాలా భయంకరమైన వ్యక్తులు. ధర్మపోరాట సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి లేఖలు రాశారు. వాటినెవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. అమిత్‌షా శ్రీకాకుళం వెళ్తే ఖాళీ కుర్చీలు స్వాగతం పలికాయి. ఇప్పటికీ సిగ్గు పడకుండా దాడి చేస్తున్నారు. నేను ఎవ్వరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ వీరి చర్యల వల్ల ప్రజలంతా బాధపడుతున్నారు. వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు’ అని చంద్రబాబు అన్నారు.

రాఫెల్ ఒప్పందం వివాదాస్పందంగా మారడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్రమోదీ ప్రభుత్వంపై ‘ది హిందూ’ పత్రిక తాజాగా మరో బాంబు పేల్చింది. ఈ ఒప్పందం సందర్భంగా అవినీతి వ్యతిరేక జరిమానాలకు సంబంధించిన కీలక నిబంధనలను రద్దు చేయడంతో పాటు తాకట్టు ఖాతా నుంచి చెల్లింపులు చేయాలన్న ఆర్ధిక సలహాదారుల సిఫారసులను సైతం కేంద్రం తోసిపుచ్చినట్టు వెలుగులోకి తెచ్చింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో అంతర-ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ)కి సరిగ్గా కొద్ది రోజుల ముందు ఈ వ్యవహారం నడిచినట్టు ‘ది హిందూ’ తాజా కథనంలో పేర్కొంది. అవినీతి నిర్మూలనే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫ్రాన్స్ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం (పీఎంవో) అధికారులు నేరుగా చర్చలు జరపడం, భారత చర్చల బృందాన్ని ‘‘తక్కువ చేసేలా’’ వ్యవహరిండంపై రక్షణ శాఖ అధికారులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసినట్టు ఇటీవల ‘ది హిందూ పత్రిక’ ఓ కథనం వెలువరించిన సంగతి తెలిసిందే.

ఇది జరిగిన వారంలోపే మోదీ ప్రభుత్వ మరో నిర్వాకం వెలుగుచూడడం గమనార్హం. రూ.58 వేల కోట్ల విలువైన రాఫెల్ ఒప్పందానికి కొద్దిరోజుల ముందు అత్యున్నత స్థాయిలో రాజకీయ జోక్యం చోటుచేసుకున్నట్టు హిందూ పత్రిక వెల్లడించింది. ‘‘మితిమీరిన జోక్యం, ఏజెంట్లు లేదా ఏజెన్సీలకు కమిషన్లు ఇవ్వడంపై జరిమానా విధించడం’’తో పాటు దసో ఏవియేషన్, ఎంబీడీయే ఫ్రాన్స్ ‘‘కంపెనీ ఖాతాల సమాచారం పొందడం’’ తదితర అంశాలు రక్షణ సామగ్రి కొనుగోలు ప్రక్రియ (డీపీపీ)లో ప్రామాణిక నిబంధనలు. సరఫరా నియమావళిలోని ఈ కీలక అంశాలను భారత ప్రభుత్వం ఉపసంహరించుకునేలా రాజకీయ ఒత్తిళ్లు జరిగినట్టు ‘ది హిందూ’ వెల్లడించింది. 2016 ఆగస్టు 24న ఐజీఏ, అనుబంధ పత్రాలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలపగా.. 2016 సెప్టెంబర్‌లో నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సారథ్యంలోని రక్షణ పరికరాల కొనుగోలు మండలి (డీఏసీ) సైతం తలూపేసింది. యుద్ధ విమానాలను సరఫరా చేసే బాధ్యత దసోది కాగా, ఎంబీడీఏ ఫ్రాన్స్.. భారత రక్షణ శాఖకు ఆయుధ సరఫరాదారుగా ఉంది.

కాగా డీపీపీ నిబంధనలను పక్కనబెట్టడంపై ఎం.పీ.సింగ్ (ధరల సలహాదారు), ఏఆర్ సూలే (వైమానికదళ ఫైనాన్షియల్ మేనేజర్), రాజీవ్ వర్మ (జాయింట్ సెక్రటీ, వైమానికదళ ఎక్వైజేషన్స్ మేనేజర) సహా నాటి చర్చల బృందంలోని ముగ్గురు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపినట్టు ‘ది హిందూ’ పేర్కొంది. ఐజీఏ ముసుగులో కమర్షియల్ కంపెనీలైన దసో, ఎంబీడీఏ ఫ్రాన్స్‌లతో నేరుగా చర్చలు జరపడం, నిబంధనలు తుంగలో తొక్కడం వివేకం కాదంటూ తమ అసమ్మతి లేఖలో వారు పేర్కొన్నట్టు వెల్లడించింది. ఫ్రాన్స్ నుంచి బ్యాంకు గ్యారంటీతో సంబంధం లేకుండా ఫ్రాన్స్ ప్రధాని నుంచి చట్టపరంగా ఎలాంటి బలంలేని ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్‌’తో భారత ప్రభుత్వం సరిపుచ్చుకోవడానికి వెనుక ఈ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. యుద్ధవిమానాలను సరఫరా చేస్తున్న కంపెనీలు రెండూ ప్రైవేటు కంపెనీలు కాబట్టి వాటికి చెల్లింపులు చేసేందుకు తాకట్టు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఈ ఖాతా నుంచి భారత ప్రభుత్వం తొలుత ఫ్రాన్స్ ప్రభుత్వానికి డబ్బు పంపితే... అది సమయానుకూలంగా సదరు కంపెనీలకు చేరుకోవడం ద్వారా ఆర్ధికంగా భారత్‌కు భరోసా లభిస్తుంది. ఆర్థిక సలహాదారులు చేసిన ఈ సిఫారసులను సైతం కేంద్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

ఏపీ పై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూఢిల్లీలో తలపెట్టిన ‘ధర్మ పోరాటం’ దీక్షకు బీజేపీ అసమ్మతి నేతలు శత్రుఘన్ సిన్హా, యశ్వంత్ సిన్హా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శత్రుఘన్ సిన్హా మాట్లాడుతూ చంద్రబాబును కొనియాడారు. ‘ఆంధ్రా హీరో.. హీరో ఆఫ్ ది నేషన్..మోస్ట్ లవుడ్, ఫాలోడ్, admired ’ అని చంద్రబాబును కీర్తించారు. తాము పార్టీకి హాని చేసే కార్యకలాపాలేవీ చేయడం లేదని, అన్యాయానికి వ్యతిరేకంగా తమ గొంతు వినిపిస్తామని శత్రుఘన్ సిన్హా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన పార్టీని అవమానించినట్టు కాదని ఆయన అన్నారు. తాను పార్టీలోనే ఉన్నానని, ఇంకా పార్టీ ఎంపీనేనని సిన్హా అన్నారు. ప్రత్యేక హోదా అనేది ఏపీకి సంబంధించిన విషయం కాదని అది దేశానికి సంబంధించిన విషయమని సిన్హా ఉద్ఘాటించారు.

babu 11022019

శత్రుఘ్నసిన్హా ధర్మపోరాట దీక్షకు హాజరుకావడం వెనుకనున్న ఒక విశేషాన్ని టీడీపీ నేత, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ సభావేదికపై తెలియజేశారు. శత్రుఘ్నసిన్హాకు ఎంతో ముఖ్య స్నేహితుడు అయిన తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె పెళ్లికి వెళ్లవలసి ఉండగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని మరీ ధర్మపోరాట దీక్షకు వచ్చారని మురళీమోహన్ తెలిపారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని తెలుసుకున్న శత్రుఘ్నసిన్హా.. పెళ్లికంటే ఇది ముఖ్యమైన పని అని.. ఫ్లైట్ టిక్కెట్ రద్దు చేసుకుని చంద్రబాబు దీక్షా స్థలికి వచ్చారని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ వివరించారు. చంద్రబాబు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే.. పెళ్లికంటే ఇదే ఎంతో ముఖ్యమైందని భావించి, వచ్చి ప్రసంగించినందుకు మురళీమోహన్ అక్కడ ఉన్న అందరి తరఫున, టీడీపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ తరఫున శత్రుఘ్నసిన్హాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

babu 11022019

మరో పక్క,ధర్మపోరాట దీక్షలో చంద్రబాబుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రశంసలు కురిపించారు. ఇందుకు ప్రతిగా చంద్రబాబు సైతం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న కమల్‌నాథ్...చంద్రబాబు తనకు మంచి మిత్రుడని, సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ నేత అని తొలుత ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రజలకు మధ్యప్రదేశ్ రాష్ట్రం తరఫున, కాంగ్రెస్ తరఫున సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు చంద్రబాబు చేస్తున్న దీక్ష ప్రశంసనీయమని అన్నారు. ఇవాళ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వ్యవస్థలన్నింటినీ కేంద్రం నీరుగారుస్తోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థ నుంచి, ఆర్బీఐ, సీబీఐ వరకూ వ్యవస్థలన్నింటిపై దాడి జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్య పరరిక్షణకు అంతా కంకణబద్ధులు కావాలన్నారు. చంద్రబాబునాయుడు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ప్రధాని దేవగౌడా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాద్, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌, శరద్‌ యాదవ్‌ తదితరులు దీక్షకు మద్దతు పలికారు. ఏపీభవన్ వేదికగా దీక్షకు దిగారు. 23 పార్టీలు చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపాయి. ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీని వేదికపై నిలదీశారు. ఏపీ హక్కుల సాధనలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ...ఫోన్ లో చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు.

ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో ప్రధాని మోదీ చెప్పాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభా వేదికగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నాంచారు గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రఫేల్‌ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా.. చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోదీని, బీజేపీని ఓడిద్దాం అంటూ రాహుల్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్టని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి హామీ ఇచ్చి అమలు చేయలేదని కేజ్రీవాల్ విమర్శించారు. మోదీపై పోరాటంలో చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

చంద్రబాబు నాయుడు లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల అదృష్టమని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాము చంద్రబాబు పోరాటానికి మద్దతిస్తున్నామన్నారు. తనను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఎంతో గౌరవించారని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సమాజ్ వాదీ మొత్తం చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా.. మీతో పాటు ఉంటాం. మీరిచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. చంద్రబాబు బలహీన పడితే.. దేశ రాజకీయాలకు అంతమంచిది కాదు. చంద్రబాబులాంటి నేత కలిగి ఉన్నందుకు ఆంధ్ర ప్రజలు అదృష్టవంతులు. ఆయన బతికి ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ దీక్షకు సంఘీభావాన్ని ములాయంసింగ్ యాదవ్ తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎల్జేడీ నేత శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్రం ధర్మం తప్పడం వల్లే ఏపీ ప్రజలు ఇక్కడికి వచ్చారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తూ.. చంద్రబాబు మంచి పని చేస్తున్నారని అభినందించారు. ఆంధ్రాలో ప్రధాని మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమన్నారు.

Advertisements

Latest Articles

Most Read