కోల్‌కతా పోలీస్ చీఫ్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ 'రాజ్యాంగ పరిరక్షణ' పేరుతో గత ఆదివారం నుంచి మమతా బెనర్జీ కొనసాగిస్తున్న దీక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం విరమింపజేశారు. అంతకుముందు మమతాబెనర్జీతో కలిసి ధర్నాలో పాల్గొన్న చంద్రబాబు మమతపై ప్రశంసలు కురిపించారు. దీక్షకు సంఘీభావం తెలిపారు. విపక్షాలకు మమత మూలస్తంభంలాంటి వారని, ఆమె నాయకత్వంలో పశ్చిమబెంగాల్ లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. సమష్టిగానే విపక్షాలు పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాయని చెబుతూ మమతను దీక్ష విరమించాలని ఆయన కోరారు. దీంతో మమత దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు.
ధర్నా ముగిస్తున్నట్టు ప్రకటించిన సందర్భంలోనే ప్రధాని మోదీపై మమత నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీని గద్దె దించి గుజరాత్‌కు పంపిస్తానని మమబెనర్జీ శపథం చేశారు. కేంద్రంలో ఆయన నాయకత్వం 'ఏక వ్యక్తి ప్రభుత్వం, ఏకపార్టీ ప్రభుత్వం'గా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏజెన్సీలతో పాటు కేంద్ర ఏజెన్సీలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తోందన్నారు. 'ప్రధానిగారూ...మీరు ఢిల్లీకి రాజీనామా చేసి తిరిగి గుజరాత్‌కు వెళ్లిపోండి. ఏక వ్యక్తి ప్రభుత్వం, ఏక పార్టీ ప్రభుత్వం అక్కడుంది' అంటూ మమత ఎద్దేవా చేసారు. కోర్టు ఇవాళ తమ వాదనకు అనుగుణంగా తీర్పు ఇచ్చిందని, వచ్చే వారం ఈ అంశాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని మమత ప్రకటించారు. తాము చేపట్టిన ధర్నా (రాజ్యంగ పరిరక్షణ) రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాధించిన విజయమని ఆమె అన్నారు. విజయహాసంతోనే ధర్నాను ఇవాళ ముగిస్తున్నామని వేదకపై సంఘీభావం తెలిపిన చంద్రబాబు, ఇతర నేతల సమక్షంలో ప్రకటించారు.
‘‘మోదీ, అమిత్ షా మినహా అందరూ అవినీతిపరులే అనే ముద్ర వేస్తున్నారు. అమిత్ షా, ఆయన కుమారుడి ఆదాయం 69 రెట్లు పెరిగింది. బ్యాంకులు దోచుకున్నవారికి దేశం నుంచి వెళ్లేందుకు పాస్‌పోర్టు ఇచ్చారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఎమర్జెన్సీ పరిస్థితి కంటే ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అన్యాయంపై పోరాడేందుకు మేమంతా ఏకతాటిపై ఉన్నాం. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పనిచేస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకు ముందు మమతా బెనర్జీతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.