విశాఖపట్నం వస్తుందని భావించిన అతిపెద్ద యుద్ధ విమాన వాహకనౌక ఐఎన్‌ఎ్‌స విరాట్‌ను మహారాష్ట్ర తన్నుకుపోయింది. దీంతో రాష్ట్రం ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది. దీన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా మలచాలని సీఎం చంద్రబాబు ఎంతో ప్రయత్నించారు. ఢిల్లీకి వెళ్లినపుడల్లా రక్షణశాఖ అధికారులతో దీనిపై చర్చిస్తూనే ఉన్నారు. విశాఖ సాగరతీరంలో ఫ్లోటింగ్‌ హోటల్‌గా మార్చాలనుకున్నారు. అంతపెద్ద నౌకను తీరానికి చేర్చడం కష్టమైన పని కాబట్టి, నీటిలోనే ఉంచాలని నిర్ణయించారు. భీమిలిలో 500ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించారు. సుమారు రూ.వేయి కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ రూపొందించారు. 2016 ప్రథమార్ధం నుంచి విరాట్‌ ఏపి వచ్చేస్తుంది అంటూ ఊరించారు. అదిగో ఇదిగో అంటూ కేంద్రం నాన్చుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేవలం మూడు నెలల క్రితం ‘విరాట్‌ మాకు కావాలి’ అంటూ మహారాష్ట్ర ప్రతిపాదన పంపింది. కేంద్రం అటువైపే మొగ్గు చూపింది.

viraat 01012019 2

అయితే గత కొన్ని రోజులుగా ఇది మహారాష్ట్రకు వెళ్ళిపోతుంది అనే ప్రచారం జరిగినా, చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కన్ని నిన్నటితో ఆ ఆశలు పోయాయి. కేంద్రం, మహారాష్ట్రలో ఒకే పార్టీ అధికారంలో ఉండడం, కేంద్రం-ఏపీ మధ్య నెలకొన్న రాజకీయ అంతరం, తదితర పరిణామాలు నేపథ్యంలో నౌక మహారాష్ట్రకే దక్కిందనే వాదన వినిపిస్తోంది. 2016 ఫిబ్రవరిలో రాష్ట్ర పర్యాటకశాఖ నిర్వహించిన సమావేశంలో, కేంద్రం మనకు ఇవ్వటానికి సమ్మతించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. 2017 జూన్‌లో విరాట్‌ను డీ కమిషన్‌ చేశారు...కానీ, ఏపీకి కేటాయిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. తర్వాత ముఖ్యమంత్రి కేంద్రానికి, రక్షణశాఖకు రెండుసార్లు లేఖలు రాసారు. అయితే మారిన రాజకీయ పరిస్థుతుల్లో, ఏపి మరో మొండిచెయ్యి ఇచ్చింది కేంద్రం.

viraat 01012019 3

విరాట్‌కు ఏ యుద్ధనౌకకు లేని చరిత్ర వుంది. ప్రపంచంలో ఎక్కువ కాలం సేవలందించినది ఇదే. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 1959 నుంచి 1980 వరకు ‘హెచ్ ఎంఎస్ హెర్మస్‌’ పేరుతో పనిచేసింది. వారి నుంచి 650 లక్షల డాలర్లకు కొనుగోలు చేసి, 12 మార్చి 1987న భారత నౌకాదళంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విరామం లేకుండా సేవలు అందించింది. దేశంలో డీ కమిషనింగ్‌ జరిగిన యుద్ధ విమాన వాహక నౌకల్లో మొదటిది విక్రాంత కాగా రెండోది విరాట్‌. ప్రతి యుద్ధనౌకకు ఒక నినాదం ఉంటుంది. విరాట్‌ నినాదం మాత్రం చాలా శక్తిమంతంగా, స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుందని నేవీ అధికారులు చెబుతున్నారు. ‘జలమేవ యశ్యే...బలమేవ తశ్యే’’ అనే నినాదం విరాట్‌పై ఉంటుంది. అంటే... సముద్రాన్ని శాసించేవారే శక్తివంతులు అనేది దాని అర్థం. ఆ విధంగానే విరాట్‌ పనిచేసింది.

బెజవాడ కనకదుర్గమ్మ భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి రావాల్సిందే. నూతన సంవత్సరం ప్రారంభం నుంచి ఈ నిబంధన అమలు కానుంది. జనవరి 1నుంచి సంప్రదాయ దుస్తుల్లో వచ్చినవారినే లోపలకు అనుమతించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఈవో కోటేశ్వరమ్మ నిర్ణయించారు. పురుషులు పంచె, ధోవతి, ప్యాంటు, చొక్కా ధరించి వచ్చినా దర్శనానికి అనుమతిస్తారు. మహిళలు చీర, చుడీదార్‌లో రావచ్చు. జీన్స్‌ ప్యాట్లు, టీషర్టులు, ఇతర పొట్టి దుస్తులతో వచ్చేవారిని మాత్రం అనుమతించరు. ఇలాంటివారు దుస్తులుమార్చుకోవడానికి వీలుగా కొండపై రిసెప్షన్‌ సమీపంలో ప్రత్యేకంగా ఓ గదిని కూడా ఏర్పాటు చేశారు. మహిళా భక్తులకు అమ్మవారి చీరలను తక్కువ ధరకే విక్రయించనున్నారు.

kanaka 01012019 2

విజయవాడ అనగానే అందరికి ముందుగా గుర్తోచ్చేది దుర్గ గుడి. ఇక్కడికి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. శుక్రవారం రోజున మాత్రం దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దుర్గమ్మను దర్శించుకొనేందుకు వచ్చే యువతులు కొంతమంది డ్రెస్ సెన్స్ ఇప్పుడు అధికారులను ఆలోచనలో పడేసింది. సంప్రదాయానికి విరుద్ధంగా టీషర్ట్, జీన్సుల్లో దర్శనానికి వస్తుండటంపై కొందరు భక్తులు మండిపడుతున్నారు. డ్రస్ కల్చర్ పై వస్తున్న ఆరోపణలపై దుర్గ గుడి అధికారులు అలర్ట్ అయ్యారు. గుడి పరిసర ప్రాంతాల్లో పాశ్చాత్య సంస్కృతికి చరమ గీతం పాడేందుకు సిద్ధమవుతున్నారు. ఈఓ కొటేశ్వరమ్మ ఆలయ అధికారులతో చర్చించి ఈ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

kanaka 01012019 3

ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన గత ఈవో సూర్యకుమారి.. ఇదే ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే, వరుస వివాదాలు రావడంతో ఈ ప్రతిపాదన పెండింగ్ లోనే ఉండిపోయింది. తాజాగా ఈఓ కొటేశ్వరమ్మ ఈ అంశంపై ఆలయ ప్రధాన అర్చకుల సలహాలు తీసుకున్నారు. ప్రస్తుతం టిటిడితో పాటు కొన్ని ముఖ్య దేవాలయాల్లో డ్రస్ కోడ్ అమలవుతోంది. ఇప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలనే నిబంధన ఉంది. మరో పక్క కొత్త ఏడాది ఆరంభమైన రోజు కావడంతో జనవరి 1న భక్తులు దుర్గమ్మ ఆలయానికి పోటెత్తారు..

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతమైంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి పయనమైన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో విజయవంతంగా ల్యాండ్ అయింది. జనవరి 7 నుంచి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జనవరి 7న ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్టు రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కనుంది. ఇప్పటికే పుట్టపర్తి, రేణిగుంట, కడపలో విమానాశ్రయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ కేంద్రంగా ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలు రావాలంటే రవాణా మెరుగుపడాలని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

orvakalu 31122018

రాష్ట్ర ప్రభుత్వం 999.50 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అధారిటీకి కేటాయించింది. రూ.90.5 కోట్లతో 2017 జూన్‌లో పనులు చేపట్టారు. కీలకమైన రన్‌వే, అప్రాన్‌, టర్మినల్‌, టవర్‌ భవనం, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.దేశీయ విమానసేవల్లో భాగంగా ఓర్వకల్లు నుంచి విజయవాడ, చెన్త్నె, బెంగళూరుకు సర్వీసులు తిరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర రాజధాని అమరావతికి వాయు మార్గంలో చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఏటీసీ కేంద్రం పనులు ముగిసిన తర్వాత
ఓర్వకల్లు నుంచి ఏప్రిల్‌ నెలలో, విజయవాడ, చెన్నైలకు విమానాలు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

orvakalu 31122018

కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి చంద్రబాబు జూన్ 2017లో శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయంతో కర్నూలు జిల్లా నుంచి వివిధ నగరాలకు విమానం ద్వారా వెళ్లే వెసులుబాటు ఉంటుందన్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తోన్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం మూడు విభాగాలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి విభాగంలో ఎనిమిది విమానాలను నిలుపుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరో విభాగంలో మూడు విమానాలు, ఇంకో విభాగంలో మరమ్మతులకు గురైన విమానాలు ఆపేందుకు అవకాశం ఉంటుంది. విమాన రాకపోకలు పెరిగాక మరో విభాగం ఏర్పాటు చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక ఇచ్చింది. ఎప్పట్నుంచే పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త ఏడాది 2019కి ఒక్కరోజు ముందు ఏపీపీఎస్సీ 7 నోటిఫికేషన్లను విడుదల చేసింది. కాగా ఈ 7 నోటిఫికేషన్లకు ఆన్‌లైన్‌‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఏపీలో పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆయా ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ ఏడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రూప్- 1..169, గ్రూప్- 2.. 446 ఉద్యోగాలతో పాటు మొత్తం 1,326 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

notification 31122018

గ్రూప్ -1 పోస్టులకు జనవరి 7 నుంచి 28 వరకు, గ్రూప్ 2 పోస్టులకు జనవరి 10 నుంచి 31 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 5న గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష, జులై 18,19 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 292,ఎగ్జిక్యూటివ్ పోస్టులు -154, సాధారణ పరిపాలన శాఖలో ఏఎస్ వో పోస్టులు -150, సీనియర్ అకౌంటెంట్లు- 20,ఎక్సైజ్ శాఖలో ఎస్సై పోస్టులు - 50, పంచాయతీరాజ్ శాఖలో ఎక్స్ టెన్షన్ అధికారులు -40, డిప్యూటీ తహశీల్దార్లు -16, ఖజనా శాఖలో సీనియర్ అకౌంటెంట్లు- 13.

notification 31122018

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి మత్స్య శాఖలోని 43 ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 305 లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు, ఫిషరీస్ సబ్ సర్వీస్ లో 10 అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8 వరకు, ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టులకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపాలని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వివరించింది.

Advertisements

Latest Articles

Most Read