తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లో జోకర్‌గా మారిపోయారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కేసీఆర్ బతుకేంటని, రాజకీయ జీవితం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. తాగుడు, వాగుడు తప్ప కేసీఆర్‌కు ఉన్న అర్హత ఏంటి? కాల్వ మండిపడ్డారు. చంద్రబాబు పెంచితే కేసీఆర్ నాయకుడు అయ్యారని తెలిపారు. టిక్కెట్ల కోసం చంద్రబాబు చుట్టూ తిరిగిన నేత కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. మోదీ బిస్కెట్లకు ఆశపడి కేసీఆర్ తమపై మొరుగుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ వల్ల కావడం లేదని మోదీనే కేసీఆర్‌ను తమపైకి వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నాడు చంద్రబాబు ఇచ్చిన సీట్ల వల్లనే టీఆర్‌ఎస్ బతికిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మోదీకి బీటీమ్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుడని, తెదేపాను రాజకీయంగా ఆయన ఎదుర్కోలేకపోతున్నాడనే ఉద్దేశంతో మోదీ దించిన రెండో కృష్ణుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి అమరావతిలో కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో ఏదో చేస్తారని మోదీ భ్రమపడుతున్నట్టు ఉన్నారన్నారు. కేసీఆర్ కలిసిన తర్వాత ఉన్నఫళంగా హైకోర్టు వెంటనే ఏర్పాటు కావాలని నోటిఫికేషన్ ఇచ్చారని, హైకోర్టుపై నోటిఫైకి ముందు నెల సమయం ఇస్తే బాగుండేదన్నారు. కనీసం నెల సమయమైనా తమకు ఇచ్చి ఉంటే సౌకర్యాలు సమకూర్చుకొని ఉండేవాళ్లమని చెప్పారు. ఆర్థిక నేరగాళ్లకు త్వరితగతిన శిక్షలు వేసేందుకు ప్రయత్నిస్తామని గతంలో ప్రధాని మోదీ అన్నారని, ఆయన చెప్పిన మాటలకు, చేసిన వ్యవహారాలకు పొంతన ఉండటంలేదని విమర్శించారు. దీంతో జగన్ కేసుల విచారణ జాప్యం జరిగే అవకాశం ఉందని తాము స్పష్టంగా అభిప్రాయపడుతున్నామన్నారు.
ఏపీలో హైకోర్టు ఏర్పాటు కాకూడదనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఈ గడ్డపై హైకోర్టు కార్యకలాపాలు జరగాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారని కాల్వ చెప్పారు. కేసీఆర్ వాడిన భాష చాలా బాధాకరమన్నారు. చంద్రబాబు పెట్టిన భిక్షతోనే తెలంగాణలో తెరాస బతికిందని, ఆయనే చేయూతగా నిలవకపోతే కేసీఆర్ సేద్యం చేసుకునేవారని అన్నారు. జగన్, కేసీఆర్ లాంటి వాళ్లు ఎందరు వచ్చినా, విడివిడిగా వచ్చినా.. కలివిడిగా వచ్చినా చంద్రబాబును, తెదేపాను ఏమీ చేయలేరని సవాల్ విసిరారు. మోదీ ప్రాపకం కోసమే కేసీఆర్ చంద్రబాబును ఆడిపోసుకుంటున్నారని విమర్శించారు. భాజపాయేతర, కాంగ్రెస్సేతర పార్టీలను ఏకం చేస్తామని కేసీఆర్ అంటున్నారని, దేశ రాజకీయ ముఖచిత్రంపై భాజపా, కాంగ్రెస్ లేకుండా మూడో ప్రత్యామ్నాయం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేనప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.