జమ్ముకశ్మీర్ అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేయడం, కేంద్రంలో బీజేపీ నేతల ఫాసిస్ట్ చర్యలకు పరాకాష్ఠ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీని నిన్న రాత్రి గవర్నర్ అర్థాంతరంగా రద్దు చేయడాన్ని ఆయన ఖండించారు. గడువు తీరకముందే శాసనసభను రద్దు చేయడం అప్రజాస్వామికమని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను కాలరాస్తూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. భాజపా నిరంకుశ, పెత్తందారీ పోకడలకు ఈ చర్య అద్దంపడుతోందన్నారు. దీన్ని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, అభ్యుదయ వాదులు ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదని, రాజ్‌భవన్ హుందాతనం ఏమాత్రం కనబడటం లేదన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తోందని చెప్పారు. సర్కారియా కమిషన్ సిఫారసులను బేఖాతరు చేయడమే కాకుండా పూంఛి కమిటీ సిఫార్సులను మోదీ సర్కార్ అటకెక్కించిందని ఆరోపించారు. మణిపూర్, గోవా, మేఘాలయాలో ఏవిధంగా ప్రజాతీర్పును కాలరాశారో దేశం మొత్తం చూసిందని, భారతదేశానికి ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రపంచానికే తలమానికంగా ఉన్న భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని భాజపా దెబ్బతీస్తోందన్నారు. భారతదేశం నియంతలను భరించదని, పెత్తందారీ పోకడలను అసలే సహించదని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు తగిన మూల్యం భాజపా చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో భాజపాకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కేంద్రం చర్యలను దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించాలన్నారు. 56 మంది సభ్యుల బలం ఉందని గవర్నర్‌ను పీడీపీ కోరినా స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. అన్నింటి వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర సంబంధాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు.