పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ఎత్తిపోతల పథకం మోటార్లకు విద్యుత్ సరఫరా అయ్యే కేబుల్ కాలిపోవటంతో మంగళవారం ఉదయం మోటార్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సంఘటన ఉదయం 8గంటలకు జరగ్గా, తక్షణం స్పందించిన ఇంజినీరింగ్ అధికారులు కాలిపోయిన కేబుళ్లను సరిచేసి ఉదయం 10.30 గంటలకు తిరిగి మోటార్లను ఆన్‌చేసి గోదావరి నీటిని కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు. కేబుల్స్ కాలిపోయిన మోటార్ల వద్దే కాకుండా విద్యుత్ ప్లాంటు నుంచి మోటార్లకు వచ్చే అన్ని కేబుళ్లను విద్యుత్ శాఖ అధికారులు నిశితంగా పరిశీలించారు.
గత జూన్ నెల నుంచి ఎత్తిపోతలలోని మోటర్లు ఆన్‌చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించారు. మధ్యలో అధిక వర్షాల కారణంగా రెండుసార్లు మోటర్లను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటి వరకూ కృష్ణా జిల్లాకు 75 టీఎంసీల గోదావరి నీటిని తరలించారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 14మీటర్ల వద్ద ఉండగా, మరికొద్దిగా నీటి మట్టం తగ్గితే మోటార్లను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. 2018 ఖరీఫ్ సీజన్‌లో తూర్పు కాలువ కింద 99 శాతం, పశ్చిమ కాలువ కింద 98 శాతం చొప్పున మొత్తమ్మీద 98 శాతం మేర ఆయకట్టులో నాట్లు పడ్డాయి. కృష్ణా జిల్లాలో అయితే 5.14 లక్షల ఎకరాలకు గాను 5.32 లక్షల ఎకరాలలో వరి వేశారు.
దాదాపు 18 వేల ఎకరాల మేర అదనంగా ఆయకట్టు సాగులోకి వచ్చింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో పెద్దగా నీరు లేకపోయినా పట్టిసీమ నుంచి ఎత్తిపోసి కాలువలకు ఇచ్చారు. గత రెండేళ్ల నుంచి ఇస్తున్నట్లే.. నీటికి ఆటంకాలు లేకుండా చూశారు. ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు మొత్తం 128 టీఎంసీల వరకు నీటిని బ్యారేజి నుంచి విడుదల చేశారు. ఇందులో 75 టీఎంసీలు గోదావరి జలాలు కావడం విశేషం. ఆయకట్టులో దాదాపపు 60 విస్తీర్ణం పట్టిసీమ నీటితోనే సాగైంది. గతంలో ఎకరానికి 35 బస్తాలు వచ్చే దిగుబడి. నేడు పట్టిసీమ పుణ్యమా అని 45నుంచి 50 బస్తాలు వస్తుంది.. రైతన్న ఇంట ధాన్యం సిరులు కురిపిస్తోంది.