రాజధాని నిర్మాణానికి నడుం కట్టిన సీఎం చంద్రబాబుకు అనూహ్యంగా ఓ అవ్వ అండగా నిలిచింది. తన పింఛను డబ్బులు రూ.12 వేలును ఆయన చేతికి అందించింది. అనంతరం చంద్రబాబును ఆప్యాయంగా ఆశీర్వదించింది. బుధవారం కృష్ణాజిల్లా చల్లపల్లి గ్రామంలో జరిగిన సభలో సీఎం పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ‘‘రాముడు నీ వెంట ఉంటాడు...రామరాజ్యం నీవల్లే సాధ్యం’’ అంటూ 90 ఏళ్ల కోగంటి చిత్రరేఖ ఆయన భుజం తట్టింది. దీంతో చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అవ్వ ఔదార్యం సీఎం చంద్రబాబును కదిలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం దివిసీమలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలను పరిశీలించారు. ఈ ప్రాంతానికే కీలకమని భావించే ఉల్లిపాలెం-భవానీపురం వంతెనను ప్రారంభించారు.
చల్లపల్లిలో జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం చల్లపల్లి పర్యటనలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ డాక్టర్ డీఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు స్వచ్ఛ సేవలకు స్ఫూర్తి ప్రధాతలుగా నిలిచారన్నారు. సంపద సృష్టికేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. నిర్వాహణతీరును ‘వెరీగుడ్’ అంటూ సందర్శకుల పుస్తకంలో రాసి సంతకం చేశారు. గతంలో కంటే ప్రస్తుతం చల్లపల్లి సుందరీకరణగా ఉందని అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ పథకం నిధులు రూ.17 లక్షలతో నిర్మించిన సంపద సృష్టి కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. పూలమొక్కలతో అందంగా తీర్చిదిద్దిన కేంద్రాన్ని చూసి ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు.
సేంద్రీయ ఎరువులతో సాగు ఆరోగ్యకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం చల్లపల్లిలో పర్యటించిన ఆయన సేంద్రీయ ఎరువులతో సాగు చేసిన వరి పంటను పరిశీలించారు. యంత్ర పరికరంతో వరికోతలను ప్రారంభించారు. రైతు తొట్టెంపూడి పెదబాబును ఎరువులు, యంత్ర పరికరం గురించి అడిగి వివరాలను తెలుసుకున్నారు. జడ్పీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖరప్రసాద్(లంకబాబు), కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలను అందజేశారు. అనంతరం మహాత్ముని విగ్రహం వద్ద ధ్యానమే నా సాధనం అన్న సూక్తితో ఉన్న మహాత్ముని చిత్రపటాన్ని ఆవిష్కరించి ప్రజలకు చూపారు.