ఆంధ్రావని పసిడి నేలపై అంకురించిన ‘ప్రకృతి సేద్యం’ అంతర్జాతీయ వేదికపై వేళ్లూనుకోనున్నది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు (భారత కాలమానం) న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రతిష్టాత్మక సదస్సులో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి బృందం ఈనెల 23 వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనుంది.
తన విదేశీ పర్యటనల్ని రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సమర్ధంగా వినియోగించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పర్యాయం కూడా పారిశ్రామిక, వాణిజ్య సమూహాలతో విస్తృత సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అనేక ద్వైపాక్షిక, బృంద సమావేశాల్లో పాల్గొంటారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్ సాంకేతిక, మేధో పరిజ్ఞానాన్ని జత చేసేందుకు పరస్పర సహాయ సహకారాలపై ప్రధానం చర్చిస్తారు. ఇప్పటికే ప్రకృతి సేద్యంలో దేశంలో అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను అంతర్జాతీయ వేదికపై వివరిస్తారు. లక్ష ఎకరాలలో ప్రారంభించి 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్రంలో చీడపీడలు లేని, భూసార, జల, వాయు కాలుష్య రహిత సేద్యాన్ని కొనసాగించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన.
ప్రజల ఆహారపు అలవాట్లు మారిన నేపధ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. శీతల గిడ్డండులలో నిల్వ చేసి పరిరక్షించడం మొదలు అంతర్జాతీయ విఫణి సదుపాయాలను కల్పించే వరకు రైతులను ప్రోత్సహించడానికి భాగస్వామ్యం తీసుకునేందుకు ముందుకు వచ్చే సంస్థలతో ఒడంబడికలు కుదుర్చుకోవడానికి ఈ పర్యటనను వినియోగించుకుంటారు. ఏపీలో అంతకంతకూ విస్తారం అవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఈ రంగంలో నైపుణ్యాలను, మరింత మెరుగైన పద్ధతులను ఏపీకి పరిచయం చేయడానికి గల అవకాశాలను అన్వేషిస్తారు.
22వ తేదీ రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బయల్దేరి అమెరికాకు వెళతారు. తొలిరోజు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్‌తో సమావేశమవుతారు. ఆ తరువాత ఇంటలిజెంట్ ఎడ్జ్, అరూబా నెట్‌వర్క్స్ (హెచ్‌పీఈ బిజినెస్ యూనిట్) వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో సమావేశం అవుతారు. తరువాత న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌జేఐటీ) స్టూడెంట్ సెనేట్‌కు వెళతారు. అదేరోజు ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో విస్తృత సమావేశం వుంటుంది.
రెండోరోజు సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థ-‘మడోయర్ మెరైన్’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. తరువాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ PHUMZILE MLAMBO-NGCUKAతో భేటీ అవుతారు. రిటైల్ బ్యాంకింగ్ సంస్థ ‘బీఎన్‌పీ పరిబాస్’ ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ జీన్ లారెంట్ బొన్నాఫే (JEAN-LAURENT BONNAFE)తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ (JIM YOUNG KIM)తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షాను కలుస్తారు. ఆ తరువాత వరసగా ద్వైపాక్షిక సమావేశాలు వుంటాయి. యుఎన్ ఎన్విరాన్‌మెంట్ ఎరిక్ సోలీమ్ (ERIK SOLHEIM)తో సమావేశం తరువాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే కీలక సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిదిమందిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరు.
మూడవ రోజు ‘డబ్లుఈఎఫ్ రిపోర్ట్’ సమన్వయకర్త టాటియానా లెబస్కీకి ఇంటర్వ్యూ ఇస్తారు. ఆ తరువాత ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’కు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి-ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే బహు పాక్షిక సమావేశంలో పాల్గొని ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదకత’ అనే అంశంపై సంయుక్త పత్రాన్ని సమర్పిస్తారు. వైర్‌లెస్ ఆప్టికల్స్ కమ్యూనికేషన్స్ రంగ దిగ్గజం-గూగుల్ ‘ఎక్స్’ సంస్థ ఉపాధ్యక్షుడు టామ్ మూరే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్-ఎఫ్ సాక్ (FSOC) ప్రాజెక్టు హెడ్ మహేశ్ కృష్ణస్వామితో లంచ్ సమావేశం జరుపుతారు. ఆ తరువాత ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగానికి చెందిన ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఇప్పటికే ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక ఐవోటీ సాధనాల ఆవిష్కరణల ఆవశ్యకతలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను ఈ సమావేశంలో వివరిస్తారు. తరువాత ఆర్డోర్ ఈక్విటీ పార్టనర్లతో సమావేశమవుతారు. అదేరోజు సాయంత్రం వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్‌తో జరిపే సమావేశంలో పాల్గొంటారు. దాని తరువాత యుఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF)కు చెందిన 25మంది ఉన్నత శ్రేణి ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంతో ఆరోజు సమావేశాలు ముగుస్తాయి.
నాలుగవ రోజు ఉదయమే మరికొన్ని ద్వైపాక్షిక సమావేశాలు, నెట్‌వర్కింగ్ సమావేశాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తరువాత భారతీయ టెలికమ్యూనికషన్ దిగ్గజం సునీల్ భారతి మిట్టల్‌తో సమావేశం అవుతారు. ఆ తరువాత ముఖ్యమంత్రి బృందం కొలంబియా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. వర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్ (ఎస్ఐపీఏ)లో ‘సాంకేతిక యుగంలో పరిపాలన’ అనే అంశంపై నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. అదేరోజు ‘జీఈ పవర్’తో సమావేశం వుంటుంది. ఆ తరువాత యుఎస్-ఇండియా వాణిజ్యమండలి (యుఎస్‌ఐబీసీ), సీఐఐ, ఏపీ ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని ఏపీలో వ్యాపార అవకాశాలపై ప్రసంగిస్తారు. తరువాత మరికొన్ని ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. ఏఈజీ ఫెసిలిటీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశం వుంటుంది. తరువాత భారత రాయబార కార్యాలయంలో సిస్కో మాజీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జాన్ చాంబర్స్‌తో భేటీ అవుతారు. 28వ తేదీ తెల్లవారుజాము 3గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
అమెరికా పర్యటనలోనే తెలుగుదేశం పార్టీ న్యూజెర్సీలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నాలుగున్నరేళ్ల తమ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరిస్తారు. న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్‌నెస్ కేంద్రంలో ఈ సభను ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్నారు.