మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాధార వ్యవస్థపై చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే, వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈరోజు సాయంత్రం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని చంద్రబాబు పరామర్శించనున్నారు. చంద్రబాబుకి, అటల్ జీ కి మంచి రిలషన్ ఉన్న సంగతి తెలిసిందే. వాజ్‌పేయి సంకీర్ణ ప్రభుత్వం నడిపే క్రమంలో, అనేక ఇబ్బందులు పడితే, చంద్రబాబే వాటిని గాడిలో పెట్టేవారు.
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా, కేంద్రం నుంచి ఎన్నో పనులు జరిగేవి. చంద్రబాబు ఏది ప్రతిపాదించినా, అటల్ జీ సానుకూలంగా స్పందించేవారు. అలాంటి మంచి రిలేషన్ ఉన్న అటల్ జీ ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకుని, ఆయన్ను పరామర్శించటానికి చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మరో పక్క, వాజ్‌పేయి నివాసం దగ్గర భారీగా భద్రతను పెంచారు. ఆయన నివాసానికి వెళ్లే మార్గంలో రోడ్లు మూసివేసి, పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
వాజ్‌పేయి ఆరోగ్యం అంతకంతకు క్లిష్టంగా మారుతుండడంతో... ఆయనను పరామర్శించేందుకు జాతీయ నేతలంతా ఎయిమ్స్‌కు తరలి వెళుతున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ, బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు వాజ్‌పేయిని పరామర్శించగా... యోగి ఆదిత్యనాథ్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా పలువురు ముఖ్యమంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఎయిమ్స్‌కు తరలి వెళుతున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 15 మంది వైద్యుల బృందం వాజ్‌పేయీకి చికిత్స అందిస్తోంది. ఒక ప్రత్యేకమైన వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.