రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీ రానున్న ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానమైనా గెలుచుకుంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఏపీకి ఎంతో చేశామని, నిధులు కేటాయించామంటూ ప్రధాని మోదీ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై పార్లమెంట్‌లో మాట్లాడాల్సిన జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించి రోడ్లపైకి వచ్చి మాట్లాడుతున్నారన్నారు.
దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని, బంద్‌లతో సాధించేది ఏమీలేదన్నారు. జగన్ బీజేపీ తొత్తుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీని అన్యాయంగా, అక్రమంగా విభజించిన కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, ప్రజలు ఆ పార్టీని దారుణంగా ఓడించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని మంత్రి కేఈ చెప్పారు. రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆధునీకరించి ప్రజలు తమ భూములు ఎక్కడున్నాయో విదేశాల నుంచైనా చూసుకోవచ్చని చెప్పారు.
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖను ఎట్టి పరిస్థితుల్లోను ప్రైవేటీకరించమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వచ్చే 170 ప్రభుత్వ శాఖల్లో రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ 3వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. ఇందుకు ఉద్యోగుల సహకారం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి సబ్ రిజిస్ట్రార్స్ అసోయేషన్ కార్యదర్శి కొండారెడ్డి, అధ్యక్షుడు రామారావు, నాయకులు రామ్మోహన్, సర్వేక్షన్‌రెడ్డి, శ్రీనివాసరావు, రమేష్‌బాబు, ప్రసాద్ గోపాల్, నరేష్‌కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.