అమరావతి కోసం, ఒక నాయుకుడు ఎలా కష్టపడుతున్నాడో, తనని నమ్మి భూములు ఇచ్చిన రైతుల కోసం ఎలా మార్కెటింగ్ చేస్తున్నాడో చెప్పే సమయంలో, అదే అమరావతి నాశనం కోరుతూ, మరో వ్యక్తి ఎలా విషం చిమ్ముతున్నాడో తెలుసుకుందాం. ఇద్దరూ ఒకే రోజు అమరావతి పై చేసిన కార్యక్రమం ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ అమరావతి పై స్పెషల్ వర్క్ షాప్ పెట్టారు. తనని నమ్మి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాల కోసం, ఒక మార్కెటింగ్ ఏజెంట్ గా, అమరావతిని ప్రమోట్ చేసారు. మరో పక్క ఇదే రోజు, పవన్ కళ్యాణ్ తను మాటి మాటికీ వెళ్ళే ఆ రెండు గ్రామాల దగ్గరకే వెళ్లి, మీరు ఎదురుతిరగండి, కాల్పులు జరగాలి అనే విధంగా, అక్కడ రైతులని రెచ్చగొట్టి 33 వేల ఎకరాల రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే రోజు, ఇద్దరు నాయకులు, అమరావతి కోసం, ఎలా చేస్తున్నారో చెప్పే సంఘటన ఇది.
అమరావతి పై ఢిల్లీలో జరిగిన స్పెషల్ వర్క్ షాప్ లో చంద్రబాబు పాల్గున్నారు. పెట్టుబడులకు అమరావతి ఎంతో అనుకూలమని చంద్రబాబుని అన్నారు. అమరావతిలో పెట్టుబడులు - అవకాశాలు అనే అంశం పై, ఢిల్లీలో సిఆర్డీఏ నిర్వహించిన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచంలో ఐదు గొప్ప నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలపడమే లక్ష్యం అని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ " మేం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని పారదర్శకంగా చేస్తున్నాం. ఎవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పనులు చేస్తున్నాం. పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చాం. దాని గురించి మాట్లాడుతున్నాం. " అని అన్నారు.
"అమరావతిలో పెద్ద పెద్ద హోటళ్ళు, స్కూల్స్, పర్యాటక ప్రదేశాలు, పార్కులు నిర్మిస్తున్నాం. దేశ విదేశాల్లో ప్రసిద్ది చెందిన విశ్వవిద్యాలయాలు వస్తున్నాయి. ఈ ప్రక్రియలో అందరినీ ప్రోత్సహిస్తున్నాం. మీరంతా ఒకసారి అమరావతికి రండి. నగరాభివృద్ధిలో భాగస్వాములవ్వండి. ప్రపంచంలోనే గొప్పనైన 5 నగరాల్లో ఒకటిగా నిలపాలనేదే మా లక్ష్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలతో ముందుకెల్తున్నాం. దేశంలోనే సరికొత్త నగరాన్ని మీరు చూస్తారు" అని చంద్రబాబు అన్నారు.