అవిశ్వాసంపై చర్చకు బదులిచ్చిన సందర్భంలో మోడీ ప్రసంగంలో ధ్వనించిన అహంకారపూరిత ధోరణిపై దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహాన్ని సజీవంగా ఉంచేందుకు చంద్రబాబు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. తన ప్రసంగంలో మోడి ఈ దేశ ప్రజలకు సవాల్ విసిరారు. 2019లో కూడా తానే ఈ పీఠంపై కూర్చుంటానంటూ ప్రక టించుకున్నారు. అప్పుడు కూడా మరోసారి అవిశ్వాసం పెట్టుకోండంటూ విపక్షాలను ఛాలెంజ్ చేశారు. ఈ ప్రసంగాన్ని టివిల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వీక్షించిన వారందరికీ మోడీలోని అహంకారం స్పష్టంగా కనిపించింది. తనకు ఈ దేశంలో ప్రత్యర్ధు లెవరూ లేరన్న ధీమా మోడీలో వ్యక్తమైంది. 120 కోట్లమంది కలిస్తే తప్ప తననేం చేయలేరన్న భరోసా స్పష్టమైంది. ఆంధ్రాప్రజల ఆకాంక్షలకడ్డుకట్టేసిన మోడీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా మండిపడు తున్నారు.
చంద్రబాబు శనివారం ఢిల్లికెళ్ళారు. జాతీయ మీడియానుద్దేశించి ప్రసంగించారు. ఇందులో అత్యధిక భాగం మోడీ అహంకార తీరును వివరించడానికే కేటాయించారు. ఆ తర్వాత చర్చ సందర్భంగా మద్దతిచ్చిన పలుపార్టీల నాయకుల్ని బాబు కలుసుకున్నారు. వారితో జరిగిన సంభాషణల్లో సింహభాగం మోడీ అహం కారంపైనే సాగాయి. ఇప్పుడీ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తేవడంలో చంద్రబాబు సఫలీకృతులౌతున్నారు. అయితే ప్రస్తుతం జాతీయ మీడియాలో అత్యధిక భాగం మోడీ అదుపాజ్ఞల్లోనే కొనసాగుతోంది. దీంతో బాబు చేస్తున్న ప్రయత్నాలకు జాతీ య మీడియా పరంగా ఆశాజనక ప్రచారం లభించడంలేదు. ఈ దశలో అందు బాటులో ఉన్న జాతీయ మీడియాను చంద్రబాబు వినియోగించు కోవాల్సిన అవ సరముంది. వాటి ద్వారానే మోడీ అహంకారధోరణిపై ప్రజల ఆగ్రహాన్ని సజీవంగా ఉంచాల్సిన అవసరముందని పరిశీలకులు సూచిస్తున్నారు.
ప్రజలు తనను కాదని మరెవర్నీ నెత్తినెట్టుకోరన్న రీతిలో ఆయన ప్రసంగం సాగింది. అసలు 120కోట్ల జనాభాలో తనను ఎదురించే వ్యక్తే మరెవరూ లేరన్న అహం ఆయనలో ప్రతిధ్వనించింది. ఈ అహంకార ధోరణి ఐదుకోట్ల ప్రజలకు బహిరంగంగా, చట్టసభల సాక్షిగా ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కేందుకు కారణమౌతుందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రారంభించిన ప్రచారం ఎన్నికల నాటికి మరింత జోరందుకుంటుంది. అయితే అందుకు తగ్గ రీతిలో జాతీయ మీడియా సహకారం పొందాల్సిన అవసరముంది. తమకనుకూలంగా ప్రచారం చేసే మీడియాను ఎంచుకోవడంలోనే జాతీయ స్థాయిలో ఈ పార్టీల భవితవ్యం ఆధారపడుంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.