భూకంపాలు వస్తాయి అని, వరదలు వచ్చి అమరావతి మునిగిపోతుంది అని, లూజ్ సాయిల్ అని, అహార భద్రతకు ముప్పు అని, ఇలా టీవీల్లో, పేపర్ లో అమరావతి గురించి ఎలా భయపెట్టారో చూసాం.. అమరావతిలో బహుళ అంతస్థుల భవంతులు కడితే, రెండో రోజే కూలిపోతుంది అని, ఒక విష పత్రిక విషం చిమ్మంది... ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమరావతి పై ప్రజల్లో ఎలాంటి భయాలు క్రియేట్ చెయ్యాలో, అలా చేసారు. అయితే, వీరికి ఎప్పటికి అప్పుడు, మాడు పగిలేలా టెక్నికల్ గా సమాధానం చెప్తూ వచ్చారు. తాజాగా, మరో సారి, భారీ నిర్మాణ సముదాయాలకు ఈ ప్రాంతం అనుకూలం కాదు అంటూ వ్యక్తమవుతున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయ నిర్మాణ ప్రాంతంలో 9 నుంచి 14 మీటర్లు (28 నుంచి 45 అడుగులు) లోతునే గట్టి రాయి తగిలినట్టు భూపరీక్షల్లో తేలింది.
దీంతో నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు, నిపుణుల్లో ఉత్సాహం నెలకొంది. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం కోసం జరిపిన భూపరీక్షల్లో ఇలాంటి రాయి తగిలేందుకు 100 నుంచి 110 అడుగుల లోతు వరకూ వెళ్లాల్సి వచ్చింది. కానీ.. శాశ్వత సచివాలయ నిర్మాణ ప్రాంతంలో మాత్రం తక్కువ లోతులోనే గట్టిరాయి కనిపించింది. కృష్ణానదీ తీరం భారీ, బహుళ అంతస్థుల భవంతులకు ఏమాత్రం అనుకూలం కాదన్న కొందరి అనుమానాలకు ఈ భూపరీక్షలతో సమాధానం లభించినట్టయింది. ఇప్పటి వరకు బహుళ అంతస్థులతో కూడిన ఈ భారీ నిర్మాణ సముదాయం కోసం 23 చోట్ల ప్రముఖ సంస్థలతో భూపరీక్షలు జరిపించగా.. అవన్నీ కూడా చాలా తక్కువ లోతులోనే గట్టిరాతి నేల ఉన్నట్టు చూపాయి.
‘షీట్ రాక్’గా నిపుణులు అభివర్ణించే ఈ రాతిపొర 40 నుంచి 50 అంతస్థులతో నిర్మితమవనున్న సచివాలయ సముదాయాన్ని త్వరగా, ధృఢంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని రాజధాని నిర్మాణపనులు పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సగిలి షణ్మోహన్, ఇతర ఉన్నతాధికారులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.2600 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయం కాంప్లెక్స్‌కు సీఆర్డీఏ ఈ ఏడాది ఏప్రిల్ 26న టెండర్లు పిలిచింది. ఈ నెల 11న వాటిని తెరవనుంది. టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తవగానే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.