ధైర్యముందా ? దమ్ముందా ? రండి తేల్చుకుందాం.. అటు జగన్ కు, జగన్ వెనుక ఉన్న బీజేపీ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాలెంజ్ చేసారు.. సాధారణంగా అధికార పక్షంలో నాలుగేళ్ళు ఉన్న వారు, ఎన్నికలు అంటే భయపడతారు.. అలాంటిది ఇక్కడ ఇన్ని పార్టీలు కలిసి ఏకం అయి, దాడి చేస్తున్నా, చంద్రబాబు మాత్రం ఎన్నికలకు సై అంటూ, కుట్ర దారులు అందరినీ కలిసి రమ్మంటున్నారు. ప్రజా తీర్పు ఏంటో తెలుసుకుందాం రండి అంటున్నారు... ‘భాజపాకు ఎన్ని ఓట్లు వస్తాయో? మీకు (వైకాపా) ఎన్ని ఓట్లు వస్తాయో? తేల్చాల్సింది ఎన్నికలే. వీటితోనే 2019 ఎన్నికల ఫలితాలు నిర్ణయమవుతాయి. నేను సవాల్ చేస్తున్నా. మేం పోటీ పెడతాం. మీకు ధైర్యముంటే ఎన్నికలకు రండి...’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ఎంపీల రాజీనామా వ్యవహారాన్ని ప్రస్తావించారు.
‘మీ కుట్రలు.. కుతంత్రాలు బయటపడాలంటే ఎన్నికలు రావాలి. సంవత్సరానికే ఎన్నికలు రావు. రేపు, ఎల్లుండి ఆమోదానికి పిలుస్తారంటూ ఎవరి చెవిలో పువ్వు పెడతారు. వైకాపాకు ఎన్నికలంటే భయం. ఎక్కడ ఓడిపోతారో అని డ్రామాలాడుతూ రాజీనామాలు చేసినా ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాళ్లా నీతి గురించి మాట్లాడేది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 25 సీట్లకు 25 సీట్లు తెదేపా గెలవడం ద్వారా వైకాపా అడ్రస్సు గల్లంతు కావాలి. భాజపా కుట్రలో పాత్రధారులను.. సూత్రధారులను చిత్తు చిత్తుగా ఓడించాలి...’ అని సీఎం పిలుపునిచ్చారు.
బీజేపీ కుట్రలోని పాత్రధారులు, సూత్రధారులందరినీ చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని పునరుద్ఘాటించారు. ఇక ప్రాంతీయ పార్టీలదే హవా అని స్పష్టం చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీ గతంలో కేంద్రంలో చక్రం తిప్పింది. భవిష్యత్తులోనూ దేశ రాజకీయాల్లో మార్పు కోసం కృషి చేస్తుంది’’ అని చంద్రబాబు తెలిపారు. కేంద్రంపై పోరాడుతూ తాను నవనిర్మాణ దీక్ష చేపడుతుంటే, కేంద్రానికి సహకరించడానికి వైకాపా వంచన దీక్ష చేస్తోందని, దీనిపై మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లు...’ అంటూ ప్రశ్నించారు.