విద్యార్ధులను తగిన విధంగా ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థలకు జరిగే పోటీ పరీక్షలకు ఎంపికై ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు ఎక్కువ సీట్లు సాధిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. 2018- నేషనల్ ఎఛీవ్‌మెంట్ సర్వే (NAS) లో ఆంధ్రప్రదేశ్ పదోతరగతి విద్యార్ధులు గణితంలో నెంబర్ -1 స్థానం సంపాదించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. కార్పొరేట్ కాలేజీలకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్ధులను ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే మన రాష్ట్రానికి సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, ఆంగ్లం, మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉత్తీర్ణతలో నెంబర్-టూ ర్యాంక్ దక్కినందుకు ఆయన అభినందనలు తెలిపారు.
కాగా ఏపీ గణిత శాస్త్రంలో నెంబర్ -1 ర్యాంకు సాధించడం, ఇతర సబ్జెక్టులలో దేశంలో నెంబర్-2 గా నిలిచినందుకు గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం విద్యార్ధులను, ఉపాధ్యాయులను, విద్యార్ధులను ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రశంసించింది. సర్వేలో ఢిల్లీ,గోవా, కర్ణాటక వరుసగా రెండు, మూడు,నాలుగో స్థానాలు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా ఆరువందల పది జిల్లాలకు చెందిన 1.544 మిలియన్ల విద్యార్ధులను సర్వే చేయగా గణితంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్ధులు గణితంలో టాప్ ర్యాంక్ సాధించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ కు ఈ ఘనత దక్కింది.
ప్రపంచ బ్యాంకు సహకారంతో జాతీయ స్థాయిలో ICDS బలోపేతం కోసం చేస్తున్న ప్రత్యేక పధకం అమలులో మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కల్పించడం ద్వారా గర్భిణి మరియు బాలింతలు ఆహారపు అలవాట్లలో మార్పు, శ్రీమంతం మరియు అన్నప్రసన వంటి కార్యక్రమాలు ద్వారా పొష్టికాహారం మరియు ఆరోగ్యపరీక్షలపై అవగాహన మరియు మొబైల్ అప్ సాంకేతికత ద్వారా అమలవుతున్న పథకాలపై పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు అమలులో మధ్య ప్రదేశ్ మరియు చత్తీస్గర్ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి ఈ గుర్తింపు లభించింది. మే 24న ఢిల్లీ లో జరిగిన కార్యక్రమములో ఈ ప్రశంస పత్రాన్ని భారత ప్రభుత్వ మహిళ సంక్షేమ శాఖ కార్యదర్శి అందజేశారు.