ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అవయవ మార్పిడి నిపుణులు భారత్ యూనివర్శిటీ చాన్స్ లర్ మహమద్ రేలా శనివారం సాయంత్రం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిశారు. మనిషి ప్రధాన అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రిని అమరావతిలో నిర్మించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్ అమరావతిలో నిర్మించతలపెట్టినట్లు డాక్టర్ రేలా ముఖ్యమంత్రికి వివరించారు. మనిషిలోని గుండె, కిడ్నీ,కాలేయం , లంగ్స్, యూట్రిస్ వంటి ప్రధాన అవయవాలను ఒక మనిషి నుంచి వేరొక మనిషికి శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయవచ్చని సీఎంకు విన్నవించారు.
తాను ఇంతవరకు 4,500 లివర్ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించానని డాక్టర్ రేలా ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతిలో అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అవయవదానం చేస్తే ప్రాణ దానం చేసినట్లేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. స్వస్థ్ జీవన్ దాన్ డొనేషన్ ద్వారా ప్రజలలో అవగాహన పెరిగిందని ఆర్గాన్స్ ని డొనేట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఇటువంటి ప్రముఖమైన ప్రాధాన్యత కలిగిన ఆసుపత్రులు అమరావతిలో నిర్మించడం వలన రాష్ట్రంలో మెడికల్ టూరిజమ్ డెవలప్ అవుతుందని , ఎంతో మందికి మంచి నాణ్యత కలిగిన వైద్యం అందుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలతో వస్తే అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ రేలాకు హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అప్పారావు, డాక్టర్ రమేష్ కృష్ణన్, డాక్టర్ వి.చౌదరి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.