అమరావతి అంటేనే ఈ ప్రభుత్వానికి చిరాకు అనే విషయం అందరికీ తెలిసిందే. అమరావతిని ఒక విఫల రాజధానిగా చేయటానికి, ప్రస్తుత పాలకులు చేయని ప్రయత్నం లేదు. ఇకా వారి పార్టీ అయితే, అమరావతి పైన, అక్కడ ప్రజల పైన ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్మారు. ఒకే కులం అన్నారు, రైతులను తిట్టారు, మహిళలను తిట్టారు, చంద్రబాబు బినామీలు అన్నారు, ఇలా ఒకటేమిటి, అన్ని రకాలుగా అమరావతిని నాశనం చేసారు. అయితే ఇప్పుడు ఇన్ని చేసి, ఇదే అమరావతి వారికి దిక్కు అయ్యింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అప్పు పుడితే కానీ రోజు గడవని పరిస్థితి. అయితే ఈ అప్పులు కూడా ఇప్పుడు ఇచ్చే వారు లేరు. తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా కట్టటం లేదని, అప్పులోళ్ళు రాష్ట్రం మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్బిఐలో ప్రతి మంగళవారం తీసుకునే అప్పు, పాత అప్పు కింద జమ వేస్తున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం, డబ్బులు కోసం, తాను ఏ అమరావతిని అయితే హేళన చేసిందో, ఇప్పుడు అదే అమరావతిని అడ్డం పెట్టుకుని, రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చుకుంది. చివరకు అమరావాతే దిక్కు అయ్యింది.
అమరావతి భూములు తాకట్టు పెట్టారని వార్తలు వస్తున్నాయి. గత వారం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ నిరసనలతో హోరెత్తించారు. చలో విజయవాడతో ఉద్యోగుల నిరసనలే, మొత్తం వార్తలు అయ్యాయి. ప్రజలు, ఉద్యోగులు అందరూ అటు వైపు ఉండగా, ఇటు వైపు వారు చేయాల్సింది చేసేసారు. అమరావతి పరిధిలో శనివారం మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో, 480 ఎకరాలను తనఖా రిజిస్ట్రేషన్ పెట్టి, రూ.3 వేల కోట్లు తెచ్చుకున్నారు. తాము పెన్ డౌన్ లో ఉన్నామని ఉద్యోగులు చెప్పినా, వారి పైన ఒత్తిడి తెచ్చి, ఈ తంతు పూర్తి చేసారు. అయితే ఈ తనఖా ఏ సంస్థకు పెట్టారు, ఏ అవసరం కోసం పెట్టారు, ఈ డబ్బు ఏమి చేస్తారు, లాంటి వివరాలు అయితే ప్రభుత్వం బయటకు చెప్పటం లేదు. ఈ రోజు ఈ వార్త బయటకు రావటంతో, ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలి. అమరావతి పైన ఇంత విషం చిమ్మి, చివరకు అమరావతి భూములు అన్నీ ఇలా ఒక్కోటి తనఖా పెట్టుకుంటూ పోతే చివరకు అక్కడ రాజధాని నిర్మాణానికి ఏమి మిగులుతుంది ?