కాగ్ వారు, ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం, 2021 మార్చి 22 నుంచి26 వరకు, ట్రెజరీ కార్యాలయాల్లో కాగ్ వారు చేసిన తనిఖీల్లో 10,806 బిల్లులకు సంబంధించి, రూ.41వేల 43 కోట్ల రూపాయల చెల్లింపులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, ఆ లేఖలో చెప్పడం జరిగిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...! "కాగ్, రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ విషయాన్ని పీఏసీ ఛైర్మ న్ పయ్యావుల కేశవ్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంపై ఆడిట్ జరిపించాలని కూడా టీడీపీనేత, గవర్నర్ ను విజ్ఞప్తి చేశారు. సీఏజీ (కాగ్) చాలా స్పష్టంగా జిల్లాల వారీగా సమాచారమిచ్చింది. కాగ్ వారు ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో కూడా, లబ్ధిదారుల వివరాలు లేకుండానే రూ.41వేల కోట్ల వరకు చెల్లింపులు జరిగాయనిచెప్పారు. ఇది ఎంతదారుణమో చూడండి. ఎవరికిచ్చారో కూడా తెలియకుండా, ఓచర్లతో పనిలేకుండా, ప్రభుత్వ ఖజానాతో సంబంధం లేకుండా రూ.41వేలకోట్లు జగనన్న ప్రభుత్వంలో దొడ్డిదారిన మాయమయ్యాయి. కాగ్ రాసిన లేఖలోని అంశాలకు సంబంధించి కొన్ని కారణాల ను రావత్ మీడియాతో చెప్పారు. నిన్న ఆయన చెప్పిన పీడీ(పర్సనల్ డిపాజిట్) అకౌంట్ల మీదనే గతంలో వైసీపీ వారు రచ్చరచ్చ చేశారు. ఏమీ లేకపోయినా, ఎక్కడా రూపాయి తేడా జరగకపోయినా నానా యాగీ చేశారు. ఇప్పుడేమో ప్రభుత్వ స్వాధీనంలోని డబ్బుని ఖర్చుచేయ లేక పోయామని, అకౌంట్లలోని డబ్బుని సకాలంలో వాడుకోలేక పోయామని రావత్ నిన్న రన్నింగ్ కామెంట్రీ వినిపించారు. రూ.41వేలకోట్లు అడ్జస్ట్ మెంట్ చేశామని చెబుతారా? సంవత్సరం అయ్యేవరకు రూ.41వేలు కోట్లు అకౌంట్లలో ఉంచి అలానే చూస్తూ ఉన్నారంటే నమ్ముతారా? ఎవరికీ తెలియదు మీ కహానీలు. సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డే ఆర్థిక శాఖను నడిపిస్తున్నారు. వారుఎవరికి చెల్లించమంటే వారికి చెల్లిస్తారు.. ఎవరికివద్దంటే వారికి ఆపుతారు. వారు చెప్పినట్లు బటన్లు నొక్కడానికే ఆర్థికశాఖలో సత్యనారాయణ అనే రబ్బర్ స్టాంపుని పెట్టారు. ఆ రబ్బర్ స్టాంప్ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల ప్రకారం చెల్లింపుల బటన్లు నొక్కుతూ ఉంటుంది. ఈ వాస్తవాలు ఏవీ రావత్ కు తెలియదా? అన్నీతెలిసి పచ్చిఅబద్ధాలతో వివరణ ఇస్తాడా?
రూ.41వేల కోట్ల చెల్లింపుల వ్యవహారం ఆర్థికశాఖలో జరిగినపెద్ద కుంభకోణం. పెద్దిరెడ్డికి, ఇతర వైసీపీ కాంట్రాక్టర్లకు ఎంతదోచిపెట్టారో లెక్క తేలాలి. ఇవన్నీ చూశాకే కదయ్యా కేంద్రం మీకు రెండు లేఖలు రాసింది. 31-03-2021న ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శైన రావత్ కు రాసిన లేఖలో ఇష్టానుసారం అప్పులు చేస్తే కుదరదన్నారు. మార్చి 22నుంచి 26వరకు కాగ్ వారి ట్రెజరీ కార్యాలయాల్లో తనిఖీలు రాష్ట్రంలో పూర్తిచేశాక, అవి పూర్తయ్యాక మార్చి31న కేంద్ర ప్రభుత్వం వారు ఏపీ ప్రభుత్వంలోని రావత్ కు లేఖ రాశారు. రూ.41వేలకోట్ల దోపిడీ బయట పడేసరికి, కేంద్ర ఆర్థిక శాఖ అత్యవసరంగా స్పందించింది. జీఎస్ డీపీలో 4శాతానికి మించి అప్పులు చేయడం కుదరదని, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.42,472కోట్లకు మించి అప్పులు చేయరాదని, దానిలో కూడా రూ.27,589కోట్లు కచ్చితంగా కేపిటల్ ఎక్స్ పెండేచర్ పై ఖర్చుపెట్టాలని కూడా స్పష్టంగా చెప్పారు. రుణాలు తెచ్చుకునే అర్హత కలిగిన రూ.42,472 కోట్లలో విధిగా, రూ.27,589కోట్లు మౌలికవస తులపై ఖర్చుపెట్టాలనే షరతుని కాగ్ వారు లేఖలో చెప్ప లేదా? అలా చేయకపోతే, జీఎస్ డీపీ 4శాతంలో 0.5శాతం కోతపెడతామని చెప్పింది నిజంకాదా? ఇష్టానుసారం అప్పులు చేసి దిగమింగుతున్నారనేకదా కేంద్ర ప్రభుత్వం వారు అన్ని షరతులు పెట్టింది. ఆలేఖలో అలా ఉంటే, జూన్ 30న రాసిన మరో లేఖలో, ఏపీప్రభుత్వం చేస్తున్న ఓవర్ బారోయింగ్, తప్పుడు సమాచారాన్ని ఎత్తిచూపలేదా? మార్చి31 రాసిన లేఖలో రుణాలకు సంబంధించి విధించిన రూ.37,163కోట్ల రుణ పరిమితిలో, గతంలో పరిమితికి మించి చేసినటువంటి అప్పైన రూ.17,923కోట్లుకోత పెట్టిందినిజంకాదా? సీఎఫ్ఎంఎస్ విధానాన్ని భ్రష్టుపట్టించి, ఇష్టానుసారం వారికి అనుకూలమైన వారికి దోచిపెట్టారు. రూ.41వేల కోట్ల ప్రజాధనం ఎవరు మింగేశారో, ఏపీప్రజలకు తెలియాలి. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ, ఆర్బీఐ కూడా దీనిపై లోతైన విచారణ జరపాలని కోరుతున్నాం. రావత్ లాంటి ఐఏఎస్ అధికారులు తప్పులను కప్పిపుచ్చుతూ, సంబంధంలేని కారణాలు చెప్పడం, పిట్టకథలు చెప్పడం మానుకుంటే మంచిది. రావత్ లో ఏమాత్రం నిజాయితీ ఉన్నా, రూ.41వేలకోట్ల వ్యవహారంపై విచారణకు సహకరించి, వాస్తవాలను తెలియచేయాలి.