ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సారి మళ్ళీ మొట్టికాయలు పడ్డాయి. అయితే ఈ సారి హైకోర్టు, సుప్రీం కోర్టు కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ , ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, ఏకంగా చీఫ్ సెక్రటరీని జైలుకు పంపాల్సి ఉంటుంది అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పధకం చేపట్టింది అంటూ, తెలంగాణాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ ను విచారణ చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ ను చేపట్ట కూడదని, పర్యావరణ అనుమతులు పుర్తిగా చేపట్టిన తరువాతే ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలోనే తీర్పు ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, ఇది పాత ప్రాజెక్ట్ అని, దీనికి మళ్ళీ అనుమతులు అవసరం లేదని, గతంలో ఉన్న ప్రాజెక్ట్ నే కొంచెం విస్తరణ చేస్తున్నామని, దీనికి పర్యావరణ అనుమతులు అవసరం లేదు అంటూ గతంలో వాదించింది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాత్రం స్టే ఇచ్చింది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తరువాత కూడా, అక్కడ పనులు ముమ్మరంగా చేపట్టారు అంటూ గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తీ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసారు.
ఆ పిటీషన్ పైనే ఈ రోజు చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శాఖ విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఏపి ప్రభుత్వం అక్కడ పనులు నిలిపివేశాం అని, పర్యావరణ అనుమతులు కోసం దరఖాస్తు కూడా చేసాం అని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలిపింది ఏపి ప్రభుత్వం. అయితే పర్యావరణ అనుమతులు అవసరం లేదు అంటూ కేంద్రానికి లేఖ రాసారు కానీ, పర్యావరణ అనుమతులు కోసం లేఖ రాయలేదు అంటూ, గవినోళ్ల శ్రీనివాస్ తరుపున హాజరు అయిన లయార్ వాదనలు వినిపించారు. అయితే గతంలో చీఫ్ సెక్రటరీ, తాము పనులు నిలిపివేస్తాం అని, పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాతే ముందుకు వెళ్తాం అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలిపిన నేపధ్యంలో, ఇప్పుడు చీఫ్ సెక్రటరీని బాద్యుడిని చేస్తాం అంటూ ఎన్జీటీ వార్నింగ్ ఇచ్చింది. మా ఆదేశాలకు విరుద్ధంగా అక్కడ పనులు జరిగితే మాత్రం, చీఫ్ సెక్రటరీని జైలుకు పంపించాల్సి ఉంటుంది అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అయితే తాజా పరిస్థితి ఏమిటో చెప్పాలని కృష్ణా మ్యానేజ్మెంట్ బోర్డుని కోరింది. తదుపరి విచారణ జూలై నెలకు వాయిదా వేసింది.